Begin typing your search above and press return to search.

బీచ్ ఫెస్టివల్.. నారాయ‌ణ‌మూర్తి గ‌ట్టిగా ఇచ్చాడు

By:  Tupaki Desk   |   13 Nov 2016 6:15 AM GMT
బీచ్ ఫెస్టివల్.. నారాయ‌ణ‌మూర్తి గ‌ట్టిగా ఇచ్చాడు
X
విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హించ‌బోయే బీచ్ ఫెస్టివ‌ల్ వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి.. తెలుగుదేశం ప్ర‌భుత్వానికి ఏమాత్రం ప్ర‌యోజ‌నం చేకూరుతుందో కానీ.. దాని గురించి జ‌రుగుతున్న ర‌చ్చ వ‌ల్ల మాత్రం చంద్ర‌బాబు స‌ర్కారు ఇమేజ్ మాత్రం బాగానే దెబ్బ తింటోంది. ఇప్ప‌టికే చాలామంది ప్ర‌ముఖులు.. రాజ‌కీయ నాయ‌కులు ఈ బీచ్ ఫెస్టివ‌ల్ ను వ్య‌తిరేకించారు. ఐతే పొలిటీషియ‌న్స్ ఏమ‌న్నా ఓకే కానీ.. ఆర్.నారాయ‌ణ‌మూర్తి లాంటి క‌మిట్మెంట్ ఉన్న వ్య‌క్తులు కూడా దీన్ని వ్య‌తిరేకిస్తుండ‌టం గ‌మ‌నార్హం. తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. తాను బీచ్ ఫెస్టివ‌ల్ కు పూర్తి వ్య‌తిరేకినంటూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు నారాయ‌ణ‌మూర్తి. తాను ఏ పార్టీకి వంత పాడ‌ట్లేద‌ని.. కామ‌న్ మ్యాన్ గా ఈ మాట చెబుతున్నానని నారాయ‌ణ‌మూర్తి అన్నారు.

‘‘దేశంలో పాశ్చాత్య సంస్కృతి ప్రభావం బాగా పెరుగుతోంది. యువత ఆ సంస్కృతికి అలవాటు పడడం.. ఆకర్షితులు కావడం సహజం. విశాఖ బీచ్ కు ప్రేమికుల్ని ఆహ్వానిస్తున్నారంట. దేశ.. విదేశీ ప్రేమికుల ముద్దులాటలు.. కౌగిలింతల్ని చూసి ఎంజాయ్ చేయమంటారా? ఇది ఎంత దుర్మార్గమైన చర్య. మనకి ఆ సంస్కృతిని అలవాటు చేయడమే కదా. ఈ సంద‌ర్భంగా మీకో ఉదాహ‌ర‌ణ చెబుతా. ఒక‌సారి హైదరాబాదులోని బ్రహ్మానందరెడ్డి పార్కులో నడుస్తుంటే న‌న్నో అమ్మాయి కౌగిలించుకోబోయింది. ఏంటని అడిగితే హగ్ కల్చర్ అని చెప్పింది. నీదే దేశం అంటే.. ఇండియానే అని.. తాను హైద‌రాబాదీనేనని చెప్పింది. ఈ క‌ల్చ‌ర్ మ‌న‌ది కాదు. ఐరోపా వాళ్ల‌ది. శీతల మండలాల్లో సంస్కృతిని మనకు అలవాటు చేస్తే అంత‌కంటే దారుణ‌ముంటుందా? కాబట్టి నేను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం నిర్వ‌హించే బీచ్ ఫెస్టివల్ ను వ్యతిరేకిస్తున్నా. వెస్ట్రన్ కల్చర్ తో మన సంస్కృతిని.. భాషల్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నాం. చిన్నపిల్లలతో టీవీల్లో ఆ డ్యాన్సులు ఏంటో అర్థం కాదు. పసిపిల్లలకు ఏమీ తెలియ‌దు. ఇలా చేస్తుంటే చివరికి వాళ్లు ఈ సంస్కృతికే అలవాటు పడతారు’’ అంటూ ఆవేద‌న వెళ్ల‌గ‌క్కారు నారాయ‌ణ‌మూర్తి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/