Begin typing your search above and press return to search.

కోదండం అండ్ కోపై కేసీఆర్ కొత్త అస్త్రం

By:  Tupaki Desk   |   14 July 2016 4:17 AM GMT
కోదండం అండ్ కోపై కేసీఆర్ కొత్త అస్త్రం
X
తమపై.. తమ ప్రభుత్వ విధానాలపై సందేహాలు సంధిస్తూ ఇరుకున పెడుతున్న వారి విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్టకేలకు పావులు కదిపారు. తనదైన శైలిలో కౌంటర్ అటాక్ ను సిద్ధం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టుల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులపైనా.. ప్రాజెక్టు రీ డిజైనింగ్ మీదా తెలంగాణ విపక్షాలు.. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన కోదండరాం లాంటి ఉద్యమనేతలతో పాటు.. పలువురు ఇరిగేషన్ శాఖలో అత్యున్నత స్థానాల నుంచి రిటైర్ అయిన వారు ప్రభుత్వ తీరును తప్పు పడుతున్న తీరు తెలిసిందే.

ఇలాంటి వాటి విషయంలో చెక్ పెట్టాలన్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా వేసిన అడుగు ఆసక్తికరంగా మారింది. పలు సాగునీటి ప్రాజెక్టుల పైన చేస్తున్న విమర్శలకు సమాధానంగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు.. నీటిపారుదల రంగ నిపుణుడిగా పేరొందిన ఆర్ విద్యాసాగర్ రావు గళం విప్పారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కోదండరాం సాధారణ వ్యక్తి కాదు. తెలంగాణ ప్రజలకు ప్రతిబింబం లాంటి వారు. అలాంటి వారు తొందరపడి మాట్లాడకూడదు. మాకు చాలా బాధ కలుగుతోంది. తెలంగాణ ఉద్యమంలో కలిసి తిరిగిన వాళ్లం. హనుమంతరావుకు.. కోదండరాంకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ప్రాజెక్టులపై ప్రజలను గందరగోళపరచవద్దు. మల్లన్నసాగర్ మీద అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చని.. ప్రాజెక్టుకు ఇంకా తుది రూపం లేదని.. అన్ని ప్రత్యామ్నాయాలు ఆలోచించాకే ప్రభుత్వం తాజా ఆలోచన చేసింది’’ అని చెప్పుకొచ్చారు.

ప్రభుత్వానికి ఉండే ఇబ్బందులు ప్రభుత్వానికి ఉంటాయని.. ప్రతిదానికి దురుద్దేశం ఆపాదించాల్సిన అవసరం లేదని... సలహాలు స్వీకరించనంత మాత్రాన ప్రభుత్వాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదంటూ రివర్స్ గేర్ లో వ్యాఖ్యానించటం గమనార్హం. అంతేకాదు.. కోదండరాం.. హనుమంతరావు లాంటి వారు.. తమకు ఏదైనా అనుమానాలు ఉంటే తగిన సమాచారం ఇస్తామని.. అవసరమైతే సంబంధిత అధికారులను పంపుతామని చెప్పుకొచ్చారు. ఇంత సాఫ్ట్ గా మాట్లాడినట్లు మాట్లాడుతూనే.. ‘‘మీరు ఎవరో పిలిచారని అక్కడికి వెళ్లి.. తెలిసీ తెలియకుండా మాట్లాడటం వల్ల ప్రజల్లో గందరగోళం తలెత్తుతుంది’’ అని చెప్పటం గమనార్హం.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కోదండరాం.. హనుమంతరావు లాంటి వారిపై పత్రికా ముఖంగా ఇన్నేసి మాటలు అనాల్సిన అవసరం లేదు. వారిని సగౌరవంగా పిలిపించి.. వారికున్న సందేహాల్ని తీర్చటం.. లేదంటే.. వారి వాదనలోని లోపాల్ని ఎత్తి చూపి.. ప్రభుత్వ విధానాన్ని వివరించి చెప్పటం ద్వారా.. విమర్శలకు కళ్లాలు వేయొచ్చు.కానీ.. అలాంటిదేమీ చేయకుండా.. రాజకీయ నాయకుడిలా విద్యాసాగర్ రావు మాట్లాడటం.. కోదండరాం.. హనుమంతరావులపై ఎదురుదాడి చేసేలా వ్యాఖ్యలు చేయటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి. మాటకు మాట అన్నట్లుగా విద్యాసాగర్ వ్యవహారం ఉందే కానీ.. సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలన్నట్లుగా లేదన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి పరిణామాలన్నీ ఉన్నట్లుండి తెర మీద రావటానికి వెనుక అసలు కారణం ఎవరన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో..?