Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లెక్కలన్నీ కాకి లెక్కలేనా?

By:  Tupaki Desk   |   18 Aug 2016 2:18 PM GMT
కాంగ్రెస్ లెక్కలన్నీ కాకి లెక్కలేనా?
X
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులపై ‘తెలంగాణ వాస్తవ జలదృశ్యం’ పేరిట ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా తప్పుల తడక అని టీఆరెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మంత్రులు - ఎమ్మెల్యేలు అంతా ఇలాంటి ఆరోపణలు చేస్తుండడం ఒకెత్తయితే - నీటిపారుదల రంగ నిపుణుడైన ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగరరావు కూడా అవే ఆరోపణలు చేయడం మరో ఎత్తు. కాంగ్రెస్ అన్నీ తప్పులే చెప్పిందనడమే కాదు.. ఆ పార్టీ ఇచ్చిన ప్రజెంటేషన్ తనకు బాధ కలిగించిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ అన్నీ కాకి లెక్కలే చెప్పిందని ఆరోపించిన విద్యాసాగరరావు... కాంగ్రెస్‌ కు ఓ గౌరవముంది, దాన్ని నిలుపుకోవాలని కూడా సూచించారు. తెలంగాణ ప్రజలు కొట్లాడిందే నీళ్లు - నిధులు - నియామకాల కోసమని గుర్తు చేసిన ఆయన తెలంగాణకు న్యాయం జరిగేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం - తెలంగాణ ఇంజినీర్లు - అడ్వకేట్లు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. 2004 నుంచి 2014 వరకు కనీసం 5లక్షల ఎకరాలకు నీళ్లిచ్చింటే బాగుండేదన్నారు. నీటి కేటాయింపుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై సుప్రీం కోర్టులో కేసులు నడుస్తున్నాయన్నారు. ఇలాంటి కీలక సమయంలో కాంగ్రెస్ నేతలు పరాయి రాష్ట్రం వారిలా తెలంగాణకు నష్టం కలిగేలా వ్యవహరించడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లెక్కలన్నీ కాకి లెక్కలు మాదిరిగా ఉన్నాయని మండిపడ్డారు.

మరోవైపు టీఆరెస్ నేతలంతా కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. అయితే... కాంగ్రెస్ వైపు నుంచి టీఆరెస్ దండయాత్రను ఎవరూ అడ్డుకునే ప్రయత్నం మాత్రం పెద్దగా చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. కాంగ్రెస్ నేతలు ఎంతో అధ్యయనం చేసి ఈ ప్రజెంటేషన్ ఇచ్చామని చెబుతుండగా నీటిపారుదల నిపుణుడైన విద్యాసాగరరావు దాన్ని కొట్టిపారేస్తుండడంతో ఏది నిజమన్న అయోమయం ప్రజల్లో ఏర్పడుతోంది. జల దృశ్యమా.. వాస్తవ జలదృశ్యమా దేన్ని నమ్మాలని అంటున్నారు.