Begin typing your search above and press return to search.

మోడీతో చేరి నువ్వు చెడిపోయావా నితీశ్‌

By:  Tupaki Desk   |   11 April 2018 12:33 PM GMT
మోడీతో చేరి నువ్వు చెడిపోయావా నితీశ్‌
X
దేనికైనా హ‌ద్దు ఉంటుంది. అది దాటితే న‌ష్టం ప‌క్కా. ఈ చిన్న విష‌యం ప‌వ‌ర్లో ఉన్న‌ప్పుడు అంత త్వ‌ర‌గా అర్థం కాదు. అధికార‌మ‌న్న‌ది చేతిలో ఉన్న‌ప్పుడు అంతులేని ధీమా వ‌స్తుంది. స‌మ‌స్త వ్య‌వ‌స్థ‌లు త‌మ స్వాధీనంలో ఉన్నాయ‌న్న బ‌లంతో ఏమైనా చేసేస్తుంటారు. దీనికి తోడు చుట్టు ఉన్న వారి ఫీడ్ బ్యాక్ సైతం మ‌రింత చెల‌రేగిపోయేలా చేస్తుంటాయి.

త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై రిటార్ట్ తీర్చుకోవ‌టంలో ప్ర‌ధాని మోడీ ప్ర‌త్యేక‌మైన శైలిని అనుస‌రిస్తార‌న్న‌ది తెలిసిందే. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల్ని ఒక ప‌ట్టాన విడిచి పెట్ట‌ని ఆయ‌న‌.. ప్ర‌తి విష‌యంలోనూ వెంటాడుతుంటార‌న్న విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా మోడీ సుదీర్ఘ‌కాలం ప‌ని చేయ‌టం వ‌ల్ల కావొచ్చు.. ఆయ‌న ఆలోచ‌న‌లు అక్క‌డే ఆగిపోయాయా? అన్న సందేహం క‌లిగేలా ఆయ‌న నిర్ణ‌యాలు ఉంటున్నాయి.

బిహార్ లో ఆర్జేడీకి షాకులు ఇచ్చే విష‌యంలో మోడీ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హిస్తార‌ని చెబుతుంటారు. దీనికి త‌గ్గ‌ట్లే ఆయ‌న నిర్ణ‌యాలు సంచ‌ల‌నంగా మారుతున్నాయి. ఆర్జేడీ అధినేత లాలూ ప్ర‌సాద్ కుటుంబంపై మోడీ ప‌ర్స‌న‌ల్ గా టార్గెట్ చేస్తున్నార‌న్న విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆర్జేడీ అధినేత లాలూ స‌తీమ‌ణి.. మాజీ సీఎం ర‌బ్రీదేవి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

త‌న‌పైనా.. త‌న కుటుంబంపైనా కుట్ర జ‌రుగుతోంద‌ని.. బీహార్ ప్ర‌భుత్వం నుంచి త‌మ కుటుంబానికి ముప్పు ఉంద‌ని ఆరోపించారు. రాత్రి తొమ్మిది గంట‌ల ప్రాంతంలో త‌మ సెక్యురిటీని ర‌ద్దు చేశార‌ని.. ప్ర‌భుత్వం త‌న కుటుంబాన్ని చంపేందుకు కుట్ర చేస్తుందంటూ ఆవేద‌న స్వ‌రంగా ర‌బ్రీ వ్యాఖ్యానించారు.

భ‌ద్ర‌త ఉప‌సంహ‌రించ‌టంపై తాను భ‌య‌ప‌డ‌టం లేద‌ని.. ప్ర‌జ‌ల్లోకి వెళ‌తాన‌ని.. త‌న‌కు ప్ర‌జ‌లే భ‌ద్ర‌త అని ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. పైన భ‌గ‌వంతుడు ఉన్నాడ‌ని.. త‌మ ప‌క్క ప్ర‌జ‌లున్నార‌ని చెప్పిన ర‌బ్రీ.. నితీశ్ స‌ర్కారును ప‌చ్చి అబ‌ద్ధాల స‌ర్కారుగా అభివ‌ర్ణించారు. త‌మ‌కు జ‌ర‌గ‌రానిది ఏదైనా జ‌రిగితే అందుకు ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాల‌న్నారు.

పాట్నాలో ర‌బ్రీదేవి నివాసం నుంచి మంగ‌ళ‌వారం రాత్రి 9 గంట‌ల ప్రాంతంలో ఆమెకు సెక్యురిటీగా ఉండే 32 మంది బిహార్ మిల‌ట‌రీ పోలీసు జ‌వాన్ల‌ను ప్ర‌భుత్వం ఉప‌సంహ‌రించింది. ప్ర‌భుత్వ ఆదేశాల‌తో రాత్రికి రాత్రి జ‌వాన్లు త‌మ సామాన్లు స‌ర్దుకొని వెళ్లిపోయారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే ప్ర‌ధాని మోడీ బిహార్ వ‌చ్చిన రోజే ర‌బ్రిదేవీ సెక్యురిటీని నితీశ్ ఉప‌సంహ‌రిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌టం సంచ‌ల‌నంగా మారింది.

ముఖ్య‌నేత‌ల సెక్యురిటీని ఉప‌సంహించుకోవ‌టం లాంటి ఉదంతాలు ప్ర‌జ‌ల్లో వారిప‌ట్ల సానుభూతిని మ‌రింత పెంచ‌టంతో పాటు.. ప్ర‌భుత్వం ఎంత దారుణంగా వేధిస్తుందో అన్న భావ‌న క‌లుగుతుంది. ఒక‌వేళ వారిపై ప్ర‌జ‌ల్లో నెగిటివ్ ఉన్నా.. ప్ర‌భుత్వ చ‌ర్య‌ల కార‌ణంగా వారిపై సానుకూల‌త త‌ధ్యం. ఇదే త‌ర‌హాలో లాలూ కుటుంబంపై వేధింపులు కంటిన్యూ అయితే.. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆర్జేడీ బిహార్ లో మ‌రింత బ‌లోపేతం కావ‌ట‌మే కాదు.. మోడీకి షాకింగ్ ఫ‌లితాలు వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదంటున్నారు. ఇంత‌కాలం నితీశ్ పై తొంద‌ర‌ప‌డి ఎవ‌రూ విమ‌ర్శ‌లు చేసేవారు. కానీ.. ఈ త‌ర‌హా నిర్ణ‌యాల‌తో ఆయ‌న కూడా రోటీన్ అధినేత‌ల త‌ర‌హాలోకి వెళ్లిపోతార‌ని.. ఆయ‌న ఇమేజ్ ను ఆయ‌న‌కు ఆయ‌నే డ్యామేజ్ చేసుకుంటున్నారన్న‌ది నితీశ్ గుర్తిస్తే మంచిది. ఎంత మోడీతో స్నేహ‌మైతే మాత్రం.. నితీశ్ త‌న ఆస్తిత్వాన్ని వ‌దులుకోవ‌టం ఏ మాత్రం క్షేమ‌క‌రం కాదు.