Begin typing your search above and press return to search.

పీసీసీ చీఫ్ మార్పు రేసులో ఆ ముగ్గురు

By:  Tupaki Desk   |   18 Nov 2016 6:08 AM GMT
పీసీసీ చీఫ్ మార్పు రేసులో ఆ ముగ్గురు
X
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంత‌ర్గ‌త రాజ‌కీయాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఆ పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. ప్ర‌స్తుత ర‌థ‌సార‌థి - హుజూర్ న‌గ‌ర్ ఎమ్మెల్యే ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప‌నితీరుపై సంతృప్తిగా లేని కాంగ్రెస్ అధిష్టానం ఈ మేర‌కు ఆయ‌న్ను మార్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అధికార టీఆర్ ఎస్ పార్టీని దీటుగా ఎదుర్కునేలా ఉత్త‌మ్ సార‌థ్యంలో కాంగ్రెస్ ముందుకు సాగ‌లేక‌పోవ‌డం వ‌ల్ల కొత్త నాయ‌కుడిని ఎంపిక చేస్తార‌ని స‌మాచారం. తెలంగాణ‌ కాంగ్రెస్ నేత‌ల‌ను హుటాహుటిన ఢిల్లీకి ర‌మ్మ‌ని పిల‌వ‌డం ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా చెప్తున్నారు.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం కాంగ్రెస్ శాస‌న‌స‌భా ప‌క్ష ఉప‌నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి - మాజీ ఉప‌ముఖ్య‌మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహా - కాంగ్రెస్ మాజీ ఎంపీ - హైద‌రాబాద్‌ కు చెందిన క్రికెట‌ర్ అజ‌హ‌రుద్దీన్‌ ల పేర్లు పీసీసీ ర‌థ‌సార‌థుల జాబితాలో వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు నేత‌ల‌ను ఢిల్లీకి ర‌మ్మ‌న‌డ‌మే కాకుండా రాబోయే మూడు రోజుల పాటు అందుబాటులో ఉండాల‌ని సూచించ‌డం ఇందుకు బ‌లం చేకూరుస్తోంది. కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ - పార్టీ జాతీయ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఈ ముగ్గురు నేత‌ల‌తో వ్య‌క్తిగ‌తంగా-వేర్వేరుగా స‌మావేశం కానున్నార‌ని తెలుస్తోంది. 2019లో కాంగ్రెస్‌ ను అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు ఏ విధంగా ముందుకు వెళ‌తార‌నే విష‌యం చ‌ర్చించిన అనంత‌రం ఈ ముగ్గురిలో ఒక‌రిని అధ్య‌క్షుడిని ఎంపిక చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇందుకోసం నివేదిక‌లు స‌మ‌ర్పించాల‌ని ఆ ముగ్గురు నేత‌ల‌ను అధిష్టానం కోరిన‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే మార్చి క‌ల్లా ఈ నాయ‌క‌త్వ మార్పు ఉంటుంద‌ని అంటున్నారు.

ఇదిలాఉండగా తన పదవిని మార్చేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి - రాష్ట్ర వ్యవహరాల ఇన్‌ చార్జి హోదాలో ఉన్న దిగ్విజయ్ సింగ్ ప్రయత్నిస్తున్నారనే వార్తల నేపథ్యంలో కొద్దికాలం క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి బెంగళూరు వెళ్లి దిగ్విజయ్ సింగ్‌ సంబంధికులను కలిసినట్టు వార్తలు వెలువడ్డాయి. డిగ్గీతో మనస్పర్థలు రావడం వల్లే ఆయన ఇన్ చార్జీ సంబంధికులను కలిసినట్టు పార్టీ వర్గాలు ఆ సమయంలో వివరించాయి. తాజాగా ఈ వార్త వెలుగులోకి రావడంతో ఉత్తమ్ పదవి ఊస్ట్ అవడం ఖాయమని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/