Begin typing your search above and press return to search.

హెడ్ లైన్ : మళ్ళీ రచ్చబండ మాట...?

By:  Tupaki Desk   |   3 Jun 2022 12:30 AM GMT
హెడ్ లైన్ : మళ్ళీ రచ్చబండ మాట...?
X
రచ్చబండ అన్న మాట వైఎస్సార్ జమానాలో తొలిసారిగా వినిపించింది. ఆయన రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత తన పాలనలో తన పధకాల మీద ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది స్వయంగా తెలుసుకోవాలని రచ్చబండ పేరిట కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. అయితే రచ్చబండకు వెళ్ళకుండానే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో అనంతలోకాలకు వెళ్ళిపోయారు. ఇక ఆ తరువాత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండ కార్యక్రమం చేశారు కానీ పెద్దగా హైలెట్ కాలేదు.

ఇక చూస్తే ఆయన రాజకీయ వారసుడుగా వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి తొలి ఏడాదే రచ్చబండ పేరిట జనాల్లో తిరగాలని అనుకుంటూ వచ్చారు. అయితే అది కుదరలేదు, ఇంతలో కరోనా వైరస్ ప్రభావంతో రెండేళ్ళ పాటు ఏపీ అంతా స్తంభించింది. ఇక ఇపుడు మూడేళ్ళ పాలన పూర్తి చేసుకున్న జగన్ ప్లీనరీని నిర్వహించనున్నారు.

వచ్చే నెలలో జరిగే ఈ ప్లీనరీ అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసేవిధంగా ఉంటుందని అంటున్నారు. ఈ ప్లీనరీలోనే జగన్ రచ్చబండ గురించి ప్రకటిస్తారు అని అంటున్నారు. రచ్చబండ పేరిట ఏపీలోని టోటల్ గా ఉనన్ 26 జిల్లాల టూర్లకు తాను వెళ్లడానికి జగన్ సిద్ధపడుతున్నారు అని కూడా చెబుతున్నారు.

అయితే ఇపుడు ఏపీలో రాజకీయం మారింది. విపక్షాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అదే టైమ్ లో గడప గడపకు ప్రభుత్వం అయినా మంత్రులు చేపట్టిన బస్సు యాత్ర అయినా కూడా పెద్దగా జనాదరణ పొందలేదని అంటున్నారు.

అంటే ప్రజలలో అసంతృప్తి గట్టిగానే ఉందని చెబుతున్నారు. మరి ఈ పరిస్థితులలో ముఖ్యమంత్రి నేరుగా రచ్చబండ అంటూ ఏదో ఒక జిల్లాలో ల్యాండ్ అయి జనాల వద్దకు పోతే వారి నుంచి వచ్చే ప్రశ్నలకు జవాబులు ఎలా చెబుతారు అన్నదే ఇక్కడ చర్చగా ఉంది.

ఇక రచ్చబండలో జనాలు కనుక నిరసన గళాలు వినిపిస్తే అది ప్రభుత్వానికి మరింత ఇబ్బందిగా మారుతుంది అన్న కలవరం ఉంది. కేవలం సంక్షేమం మాత్రమే చేసి అభివృద్ధి మరచి అంతా చేశామని చెప్పుకుంటూ రచ్చబండకు వెళ్తే అక్కడ చేదు అనుభవాలు ఎదురవుతాయని కూడా అంటున్నారు. అయితే జగన్ మాత్రం జూలైలో ప్లీనరీ నిర్వహించిన తరువాత ఎట్టి పరిస్థితులలో విపక్షాలు చాన్స్ ఇవ్వకుండా తాను ఇక మీదట రెండేళ్ల పాటు జనాల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అని అంటున్నారు. మరి రచ్చబండ ఫలితం ఎలా ఉంటుంది అన్నది చూడాలి.