Begin typing your search above and press return to search.

ఢిల్లీ ఎయిర్‌ పోర్టుకు అణుముప్పు!

By:  Tupaki Desk   |   9 Oct 2016 10:06 AM GMT
ఢిల్లీ ఎయిర్‌ పోర్టుకు అణుముప్పు!
X
దేశంలోనే నెంబ‌ర్ 1 ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్ట్ అయిన ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో ఆదివారం అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు. విమానాశ్ర‌యానికి వ‌చ్చిన ఓ కార్గో నుంచి రేడియో ధార్మిక‌త విడుద‌ల అవుతుండ‌డంతో అధికారులు హుటాహుటిన‌ స్పందించారు. విమానాశ్రయంలోని టీ3 కార్గో టెర్మినల్‌ కు వ‌చ్చిన ఎయిర్ ఫ్రాన్స్ విమానం నుంచి ఈ రేడియో ధార్మిక‌త లీక్ అవుతున్న‌ట్టు గుర్తించారు. ఫ్రాన్స్ విమానంలోని వైద్యుల‌కు సంబంధించిన ర‌సాయ‌నాల నుంచి ఈ అటామిక్ రేడియేష‌న్ లీవ్ అవుతున్న‌ట్టు గుర్తించామ‌ని విమానాశ్ర‌య అధికారులు తెలిపారు. దీని ప్ర‌భావం ప్ర‌యాణికుల‌పై ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నామ‌ని వెల్ల‌డించారు.

విమానాశ్ర‌యంలోని అన్ని కార్గొ కాంప్లెక్సుల‌ను ఖాళీ చేయించిన‌ట్టు చెప్పారు. నాలుగు ఫైర్ ఇంజన్లను ఆ ప్రాంతంలో మోహరించారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్, డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అధికారులకు కూడా స‌మాచారం చేర‌వేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ రేడియో ధార్మిక‌త లీక్‌తో ప‌ర్యావ‌ర‌ణంపైనా ప్ర‌భావం ప‌డుతుంద‌న్నారు. సాధార‌ణంగా అటామిక్ రేడియేష‌న్ వ‌ల్ల వ్య‌క్తులు అత్యంత త్వ‌ర‌గా అనారోగ్యానికి గురికావ‌డం, దాని ప్ర‌భావం తీవ్రంగా ఉంటే ప్రాణాలు సైతం కోల్పోవ‌డం జ‌రుగుతుంది.

ఒక్క మాట‌లో చెప్పాలంటే.. 1980ల‌లో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లోని భోపాల్‌ లో సంభ‌వించిన గ్యాస్ ఉదంతం మాదిరిగా ప్ర‌మాదం సంభ‌వించే అవ‌కాశం ఉంది. దీంతో విమానాశ్ర‌య అధికారులు ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించి.. ప్ర‌యాణికుల‌ను - సాధార‌ణ‌ సిబ్బందిని అప్ర‌మ‌త్తం చేశారు. ఇక‌, ఫ్రాన్స్ విమానం నుంచి వ‌చ్చిన వైద్య ర‌సాయ‌నాలు - రేడియో ధార్మిక వ‌స్తువులకు స‌రైన అనుమ‌తి ఉందో లేదో నిర్ధారించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అధికారులు పేర్కొన్నారు. మ‌రిన్ని విష‌యాలు తెలియాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/