Begin typing your search above and press return to search.

ర‌ఫెల్ డీల్ లో రిల‌య‌న్స్ జ‌స్ట్ టుమ్రీనేన‌ట‌!

By:  Tupaki Desk   |   13 Oct 2018 5:15 AM GMT
ర‌ఫెల్ డీల్ లో రిల‌య‌న్స్ జ‌స్ట్ టుమ్రీనేన‌ట‌!
X
గ‌డిచిన కొద్ది రోజులుగా ర‌ఫెల్ యుద్ధ విమానాల డీల్ వ్య‌వ‌హారం మోడీ స‌ర్కారుకు ఎన్ని చుక్క‌లు చూపిస్తుందో తెలిసిందే. మొన్న‌టి వ‌ర‌కూ ఎలాంటి మ‌చ్చ లేద‌న్న పేరుతో బండి లాంగించిన మోడీకి ఇప్పుడు ర‌ఫెల్ డీల్ పుణ్య‌మా అని క‌డుక్కోలేనంత అవినీతి మ‌కిలి అంటుకుంది. ర‌ఫెల్ లో తాము సుద్ద‌పూస‌ల‌మ‌ని చెప్పినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ‌రూ న‌మ్మ‌లేని ప‌రిస్థితి.

దీనికి తోడు ఇటీవ‌ల కాలంలో ర‌ఫెల్ డీల్ కు సంబంధించి బ‌య‌ట‌కు వ‌స్తున్న వివ‌రాలు.. అంత‌కంత‌కూ మోడీని మ‌రింత డ్యామేజ్ చేస్తున్నాయ‌ని చెప్పాలి. ఇదిలా ఉంటే.. ర‌ఫెల్ డీల్ పై తాజాగా ఫ్రాన్స్ సంస్థ ద‌సో ఏవియేష‌న్ సీఈవో ఎరిక్ ట్రేపియ‌ర్ తాజాగా ఒక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయ‌న చెప్పిన కీల‌కాంశం ఏమంటే.. ర‌ఫెల్ ఒప్పందంలో రిల‌య‌న్స్ అన్న‌ది కేవ‌లం 10 శాతం మాత్ర‌మేనని.. ఒప్పందంలో భాగ‌స్వామ్యం కోసం వంద‌కు పైగా భార‌త కంపెనీల‌తో తాము చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు వెల్ల‌డించారు.

ద‌సో ఏవియేష‌న్ సీఈవో మాట‌లు చూస్తుంటే.. ఈ వ్య‌వహారంపై క‌వ‌రింగ్ ప్ర‌య‌త్నాలు షురూ అయ్యాయా? అన్న సందేహానికి తావిచ్చేలా ఆయ‌న మాట‌లు ఉన్నాయ‌ని చెప్పాలి. ర‌ఫెల్ డీల్ లో రిల‌య‌న్స్ పాత్ర‌ను వీల‌నైంత వ‌ర‌కూ త‌గ్గించి చూపించాల‌న్న‌ట్లుగా ఎరిక్ తాజా వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

విదేశీ సంస్థ‌లు భార‌త్ తో ఒప్పందాలు చేసుకోవాలంటే భార‌త చ‌ట్టాల్ని అనుస‌రించాల‌న్నారు. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బ‌దులుగా రిల‌య‌న్స్ ను ఎందుకు ఎంపిక చేసుకున్నారు? అన్న ప్ర‌శ్న‌కు ఎరిక్ బదులిస్తూ.. డ‌సో రిల‌య‌న్స్ ఏరో స్పేస్ లిమిటెడ్ జాయింట్ వెంచ‌ర్ ద్వారా త‌మ ఉనికిని దీర్ఘ‌కాలం ఉంచుకోవాల‌ని అనుకున్నామ‌ని.. అందుకే ఈ జాయింట్ వెంచ‌ర్లో నాగ‌పూర్ ఫ్లాంట్ నుంచి ర‌ఫెల్.. ఫాల్క‌న్ 2వేల ప‌రిక‌రాల్ని ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మాజీ ఫ్రాన్స్ అధ్య‌క్షుడి మాట‌ల‌కు భిన్నంగా ద‌సో మాత్రం.. రిల‌య‌న్స్ ను తామే స్వ‌చ్ఛందంగా ఎంపిక చేసిన‌ట్లుగా ప్ర‌క‌టించింది. చూస్తుంటే.. ర‌ఫెల్ వ్య‌వ‌హారంలో పీక‌ల్లోతు మునిగిన మోడీషాల‌కు బ‌య‌ట‌ప‌డేసేందుకు వీలుగా ద‌సో సీఈవోనే నేరుగా సీన్లోకి వ‌చ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది. మ‌రి..ఎరిక్ వ్యాఖ్య‌ల‌పై రాహుల్ ఎలాంటి కౌంట‌ర్ ఇస్తారో చూడాలి.