Begin typing your search above and press return to search.

అధికారుల్ని అడిగే అంబానీల‌కు ఇచ్చారా నిర్మ‌ల‌?

By:  Tupaki Desk   |   3 Oct 2018 6:46 AM GMT
అధికారుల్ని అడిగే అంబానీల‌కు ఇచ్చారా నిర్మ‌ల‌?
X
రాఫెల్ ఇష్యూలో నిండా ఆరోప‌ణ‌ల బుర‌ద అంటించేసుకున్న మోడీ స‌ర్కారు.. ఇప్పుడు ఆ మురికి క‌డుక్కునే ప‌నిలో బిజీబిజీగా ఉంది. మొన్న‌టివ‌ర‌కూ సుద్ద‌పూస‌లా ఉన్న త‌మ‌పై ప‌డిన రాఫెల్ మ‌చ్చ‌ను తొల‌గించుకునే తొంద‌ర్లో త‌ప్పుల మీద త‌ప్పులు మాట్లాడేస్తూ మ‌రింత ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లోకి కూరుకుపోతున్నారు.

రాఫెల్ మీద మాట్లాడాల్సిన ప్ర‌ధాని మోడీ ఇప్ప‌టివ‌ర‌కూ సూటిగా ఈ ఒప్పందం మీదా.. తెర మీద‌కు వ‌చ్చిన వివాదాల మీద పెద‌వి విప్పేందుకు ఇష్ట‌ప‌డ‌ని ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. కేంద్ర ర‌క్ష‌ణ మంత్రిగా ఉన్న నిర్మ‌ల సీతారామ‌న్ మాత్రం అదే ప‌నిగా క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దుర‌దృష్ట‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఆమె ఎంత‌గా క‌వ‌ర్ చేయాల‌ని భావిస్తున్నారు అంత‌గా కూరుకుపోతున్నారు.

మొన్న‌టికి మొన్న చెన్నైలో ఫ్రాన్స్ మాజీ అధ్య‌క్షుడు.. అంబానీల మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌న్న సందేహాన్ని వ్య‌క్తం చేసి మోడీ ప్ర‌భుత్వాన్ని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసిన ఆమె.. తాజాగా డీల్ గొప్ప‌త‌నాన్ని చెప్పి మ‌రీ బుక్ అయ్యారు. కాంగ్రెస్ కంటే తాము రెడీ టూ యూజ్ విమానాల్ని ఎక్కువ‌గా కొనుగోలు చేస్తామ‌ని చెప్ప‌టం ద్వారా మేకిన్ ఇండియా అంతా ఫార్సు అన్న చందంగా నిర్మ‌ల‌మ్మ మాట‌లు ఉన్నాయ‌ని విమ‌ర్శ‌కులు వేలెత్తి చూపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా మ‌రోసారి ఇదే అంశం మీద మాట్లాడిన ఆమె రాఫెల్ యుద్ధ విమానాల సంఖ్య‌ను త‌మ ప్ర‌భుత్వం ఉద్దేశ పూర్వ‌కంగా త‌గ్గించింద‌న్న మాట‌లో ఏ మాత్రం నిజం లేద‌ని చెప్పారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యించిన 126 యుద్ధ విమానాల స్థానే 36కే ప‌రిమితం చేయ‌టం వెనుక ప్ర‌భుత్వ నిర్ణ‌యం క‌న్నా.. కీల‌క అధికారుల స‌ల‌హాలే కార‌ణ‌మ‌ని చెప్పారు.

ప్ర‌ధాని మోడీ ఒక్క‌రే విమానాల కొనుగోలు సంఖ్య‌ను కుదించాల‌ని భావించ‌లేద‌ని.. ర‌క్ష‌ణ అధికారుల్ని సంప్ర‌దించిన త‌ర్వాతే విమానాల సంఖ్య‌ను త‌గ్గించిన‌ట్లుగా చెప్పారు. విమానాల కొనుగోలు సంఖ్య‌ను ర‌క్ష‌ణ అధికారుల సూచ‌న‌ల మీదే త‌గ్గించినట్లు చెబుతున్న సీతారామ‌న్‌.. ఎలాంటి అనుభ‌వం లేని అంబానీ డిఫెన్స్ కు ఈ డీల్ అప్ప‌జెప్పాల‌ని ర‌క్ష‌ణ అధికారులే చెప్పారా నిర్మ‌లాజీ? అని ప్ర‌శ్నిస్తున్నారు. త‌ప్పుల మీద త‌ప్పులు మాట్లాడుతూ.. ప్ర‌త్య‌ర్థుల‌కు అవ‌కాశం ఇచ్చే క‌న్నా.. మోడీ మాదిరి మాట్లాడ‌కుంటే మంచిదేమో? కాస్త ఆలోచించుకొని మాట్లాడండి నిర్మ‌లాజీ?