Begin typing your search above and press return to search.

కామ‌న్వెల్త్ లో గుంటూరు కుర్రాడి సంచ‌ల‌నం

By:  Tupaki Desk   |   7 April 2018 1:39 PM GMT
కామ‌న్వెల్త్ లో గుంటూరు కుర్రాడి సంచ‌ల‌నం
X
కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో గుంటూరు కుర్రాడు అద‌ర‌గొట్టేశాడు. ఇప్ప‌టికే కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో హ‌వా న‌డిపిస్తున్న లిఫ్ట‌ర్లు మ‌రో ప‌త‌కాన్ని భార‌త్ ఖాతాలో వేసేశారు. విభాగం ఏదైనా.. ప‌త‌కం మాత్రం భార‌త్ లిఫ్ట‌ర్ల‌దేన‌న్న‌ట్లుగా ప‌రిస్థితి ఉంది. తాజాగా మెన్స్ 85 కేజీల విభాగంలో తెలుగు కుర్రాడు రాగాల వెంక‌ట్ రాహుల్ స్వ‌ర్ణ ప‌తకాన్ని గెలుచుకున్నాడు.

తాజా విజ‌యంతో భార‌త్ ఖాతాలో నాలుగు స్వ‌ర్ణ ప‌త‌కాలు చేరాయి. ఈ నాలుగు స్వ‌ర్ణాలు వెయిట్ లిఫ్టింగ్ విభాగం నుంచే రావ‌టం విశేషం. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. రాహుల్ కు ఇదే తొలి కామ‌న్వెల్త్ క్రీడ‌లు. అయిన‌ప్ప‌టికీ ఎలాంటి త్రోటుపాటుకు గురి కాకుండా ప‌త‌కాన్ని సొంతం చేసుకోవ‌టం తెలుగువాళ్ల‌కు సంతోషాన్నిస్తోంది.

ఈ రోజు జ‌రిగిన పోటీలో మొత్తంగా 338 కేజీల బ‌రువును ఎత్తిన రాహుల్ బంగారు ప‌త‌కాన్ని సొంతం చేసుకున్నాడు. రాహుల్ త‌ర్వాతి స్థానంలో స‌మోకి చెందిన డాన్ ఒపెలొగెకి ర‌జ‌తాన్ని సొంతం చేసుకోగా.. మ‌లేషియాకు చెందిన మ‌హ్మ‌ద్ ఫాజ్రుల్ కాంస్యాన్ని సొంతం చేసుకున్నారు. తెలుగోడి స‌త్తా అంత‌ర్జాతీయ క్రీడా వేదిక మీద మ‌రోసారి మెర‌వ‌టం తెలుగోళ్లంద‌రికి సంతోషాన్ని క‌లిగించేదిగా చెప్ప‌క త‌ప్ప‌దు.