Begin typing your search above and press return to search.

నేనా..టీటీడీ చైర్మ‌నా...అంతా అబ‌ద్దం

By:  Tupaki Desk   |   25 Jan 2018 9:28 AM GMT
నేనా..టీటీడీ చైర్మ‌నా...అంతా అబ‌ద్దం
X
సుదీర్ఘ‌కాలంగా పెండింగ్‌ లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకం విష‌యంలో మ‌రో ట్విస్ట్ తెర‌మీద‌కు వ‌చ్చింది. టీటీడీ చైర్మ‌న్ గిరీ కోసం ప్ర‌ముఖంగా వినిపించిన ఇంకా చెప్పాలంటే..కొన్ని మీడియా సంస్థ‌లు ఊద‌ర‌గొట్టిన సినీ ప్ర‌ముఖుడు కే రాఘ‌వేంద్ర‌రావుకు ఆ చాన్స్ ద‌క్క‌డం లేద‌ట‌. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే...రాఘ‌వేంద్ర‌రావు ఆ ప‌ద‌విని వ‌ద్ద‌న్నారు.

ఏపీలో ఏ పదవికి లేని విధంగా టీటీడీ దేవస్థానం చైర్మన్‌ పదవికి డిమాండ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇందులో ప్ర‌ధానంగా న‌లుగురి పేర్లు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయి. టీడీపీ ఎంపీలు రాయపాటి సాంబశివరావు - మురళీమోహన్‌ తో పాటు సినీ దర్శకులు రాఘవేంద్రరావు - వైఎస్సార్‌ కడప జిల్లా నుంచి పుట్టా సుధాకర్‌ యాదవ్ - నెల్లూరు నుంచి బీదా మస్తాన్‌ రావు పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయని మీడియాలో జోరుగు ప్ర‌చారం జ‌రిగింది. అయితే క్రైస్త‌వ మ‌తంతో సంబంధం క‌లిగి ఉన్నందున పుట్టా సుధాక‌ర్ పేరు జాబితా నుంచి పక్క‌కుపోయింది. అనూహ్య‌రీతిలో సినీ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు పేరు ఖ‌రారు అయిన‌ట్లుగా కొన్ని మీడియా సంస్థ‌లు పేర్కొన్నాయి.

త‌న పేరు టీటీడీ చైర్మ‌న్ రేసులో ఉంద‌నే విష‌యం నిజంకాద‌ని రాఘ‌వేంద్ర‌రావు ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అలా జ‌రుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఎస్‌వీసీసీ చాన‌ల్ ద్వారా తాను సంతృప్తిగా ఉన్నాన‌ని..ఇది ఎంతో సంతృప్తిని ఇస్తోంద‌న్నారు. అయితే, రాఘ‌వేంద్ర‌రావు పేరు ప్ర‌చారంలో ఉన్న స‌మ‌యంలోనే కొంద‌రు ఆయ‌న‌కు చైర్మ‌న్ గిరీ ద‌క్క‌క‌పోవ‌చ్చున‌ని పలువురు అంచ‌నా వేశారు. ఆయ‌న‌కు చైర్మ‌న్ గిరీ ఇవ్వ‌డం ద్వారా రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని, సీఎం చంద్ర‌బాబు ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌చ్చున‌ని విశ్లేషించారు. ఇలాంటి స‌మ‌యంలోనే రాఘ‌వేంద్ర‌రావు ప్ర‌క‌ట‌న విడుద‌ల కావ‌డం ఆస‌క్తిక‌రం.