Begin typing your search above and press return to search.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల సంఖ్య 21 మాత్ర‌మేనా!

By:  Tupaki Desk   |   5 Feb 2020 5:30 PM GMT
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల సంఖ్య 21 మాత్ర‌మేనా!
X
గ‌త ఏడాది జ‌రిగిన లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22 ఎంపీ సీట్ల‌ను పొందిన సంగ‌తి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున కేవ‌లం ముగ్గురు ఎంపీలు మాత్ర‌మే నెగ్గారు. వారిలో కూడా ఇద్ద‌రు స్వ‌ల్ప మెజారిటీల‌తో నెగ్గిన వారే. 22 మంది ఎంపీల‌తో వైసీపీ అప్పుడు సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

అలా వైసీపీ త‌ర‌ఫున 22 మంది నెగ్గినా ఇప్పుడు ఒక ఎంపీ మాత్రం ఆల్మోస్ట్ త‌ను వైసీపీ కాదు అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టుగా స‌మాచారం. ఆయ‌న మ‌రెవ‌రో కాదు న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజు. గ‌త కొన్నాళ్లుగా ఆయ‌న తీరు వైసీపీకి దూర‌దూరంగా ఉంద‌ని స్ప‌ష్టం అవుతోంది. ఎంపీగా నెగ్గి, ఢిల్లీలో అడుగుపెట్ట‌డానికి వైసీపీని ఉప‌యోగించుకున్న ర‌ఘురామ‌కృష్ణం రాజు ఆ త‌ర్వాత పార్టీ వ్య‌తిరేక ప్ర‌క‌ట‌న‌లు కూడా వెనుకాడ‌టం లేదు. ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న కొన్ని నిర్ణ‌యాల‌ను ఆయ‌న వ్య‌తిరేకిస్తూ మాట్లాడారు. దానిపై సీఎం పిలిచి క్లాస్ పీక‌డం కూడా జ‌రిగింది. ఆ త‌ర్వాత మాట‌ల్లేవు కానీ.. ఎంత‌సేపూ ఇత‌ర పార్టీల వాళ్ల‌తో రాసుకుపూసుకుతున్నారు రాఘురామ‌కృష్ణం రాజు. ఢిల్లీలో వేరే పార్టీల వాళ్ల‌కు పార్టీలు ఇస్తూ ఆయ‌న హ‌ల్చ‌ల్ చేస్తూ ఉన్నారు. పార్ల‌మెంట్ స‌మావేశాల సంద‌ర్భంగా కూడా వైసీపీ ఎంపీల‌తో క‌న్నా... బీజేపీ వాళ్ల‌తోనే ఆయ‌న ఎక్కువ‌గా క‌నిపిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.

దీంతో ఈయ‌న‌ను వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా లెక్క వేయ‌డం కూడా క‌ష్ట‌మే అవుతోంద‌నే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఎంపీగా నెగ్గ‌డానికి వైసీపీని ఉప‌యోగించుకున్న ర‌ఘురామ‌కృష్ణం రాజు, ఆ త‌ర్వాత మాత్రం పార్టీకి మొహం చాటేస్తున్న‌ట్టుగా ఉన్నాడు. అయితే ఈయ‌న విష‌యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా త‌న వంతు ఏర్పాట్ల‌లో ఉన్న‌ట్టుగా స్ప‌ష్టం అవుతూనే ఉంది. న‌ర‌సాపురంలో ఇప్ప‌టికే పార్టీ లోకి ప్ర‌త్యామ్నాయ నేత‌ల‌ను కూడా చేర్చుకుని జ‌గ‌న్ అన్నింటికీ రెడీగానే క‌నిపిస్తున్న‌ట్టున్నార‌ని ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.