Begin typing your search above and press return to search.

వైకాపాలో నో ఎంట్రీ బోర్డు పెట్టినందుకే అలా...

By:  Tupaki Desk   |   4 May 2018 10:34 AM GMT
వైకాపాలో నో ఎంట్రీ బోర్డు పెట్టినందుకే అలా...
X
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని నాయకులు వీడిపోతుండడం మొదలైంది. ఎన్నికలు మరో ఏడాది దూరం ఉన్నప్పటికీ... భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకూ తిరిగి కోలుకోవడం అసాధ్యం అని... ఇప్పటికే అందరూ నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నుంచి నాయకులు తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం.. ఇతర పార్టీల బాట పట్టడం కూడా అనివార్యంగా జరిగిపోతోంది. తాజాగా పార్టీకి రాజీనామా చేసిన వెస్ట్ గోదావరి జిల్లా నాయకుడు రఘురామకృష్ణం రాజు.. తెలుగుదేశంలో చేరుతున్నారు. అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ఆయన తొలుత వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడానికి ప్రయత్నించారని... అక్కడ నో ఎంట్రీ బోర్డు పెట్టినందుకే ఇక వేరే గత్యంతరం లేక తెలుగుదేశంలో చేరడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

భాజపా నంచి నేతలు బయటకు వలసలు వెళ్లడానికి నిశ్చయించుకున్న మాట మాత్రం వాస్తవం. అయితే ఎగబడి వస్తున్న వారిని బేరీజు వేసి పార్టీలో చేర్చుకోవాలని వైకాపా జాగ్రత్తలు పాటిస్తోంది. ఆ క్రమంలోనే రఘురామకృష్ణం రాజు కూడా తొలుత వైకాపాలో చేరడానికి ప్రయత్నించి.. అక్కడ నో ఎంట్రీ బోర్డు చూపించడంతో.. తెదేపా వైపు వెళ్లారని సమాచారం.

ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయిలో గుర్తింపు పొందిన కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా జరిగిపోయింది... వైకాపాలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఎవరు వచ్చినా చేర్చుకోవడానికి గతంలో ఉత్సాహపడిన చంద్రబాబునాయుడు - భాజపా నుంచి కూడా ఎవరొచ్చినా చేర్చుకునే సిద్దాంతంతోనే ముందుకెళుతున్నారు. వారివలన తన పార్టీకి ఎంత లాభమో చూసుకోకుండా.. ఆ పార్టీ బలహీన పడిపోతే చాలు అనేదే ఆయన సూత్రంగా కనిపిస్తోంది. దానివలన సొంత పార్టీలో చికాకులు పెరుగుతున్నా ఖాతరు చేయడం లేదు.

భాజపా నాయకులు ఆ పార్టీని వీడి తన పార్టీలోకి రావడానికి ఆయన ప్రత్యేకంగా కొందరికి తాయిలాలు ప్రకటిస్తున్నట్లుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. భాజపా నుంచి నేతలు తన పార్టీలోకి వస్తే గనుక.. మోడీ గురించి తాను చేస్తున్న ప్రచారం నిజం అని... వారందరికీ తనే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నానని డప్పు కొట్టుకోవడం సాధ్యమవుతుందన్నట్లుగా ఆయన ఆలోచన సాగుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తాయిలాల కోసం కాకపోయినా... రఘురామ కృష్ణం రాజు మాత్రం.. వైకాపా రానివ్వకపోవడం వలన అటు వెళ్తున్నట్లు సమాచారం.