Begin typing your search above and press return to search.

రాజు గారు మీసం మెలేస్తున్నారు ...డిఫెన్స్ లోనేనా.. ?

By:  Tupaki Desk   |   12 Jan 2022 7:30 AM GMT
రాజు గారు మీసం మెలేస్తున్నారు ...డిఫెన్స్ లోనేనా.. ?
X
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణంరాజు చాలా కాలం తరువాత సొంత ఊరు వస్తున్నారు. ఆయన నర్సాపురానికి సంక్రాంతికి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ రచ్చ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అంటున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నర్సాపురం దాకా భారీ కాన్వాయ్ మధ్యన రఘురామ అట్టహాసంగా చేరుకుంటారని అంటున్నారు. ఒక విధంగా ఉప ఎన్నికలకు రఘురామ సంక్రాంతి రోజునే గంట కొట్టేస్తారు అంటున్నారు.

రఘురామ నర్సాపురం నుంచి ఉప ఎన్నికల్లో పోటీకి తయారుగా ఉన్నారు. తాను రెడీ, జగన్ తోనే ఢీ అంటున్నారు. ఆయన దూకుడు చూస్తూంటే జగన్ సర్కార్ కి నర్సాపురం ఉప ఎన్నిక నుంచే భారీ షాక్ ఇవ్వడం ద్వారా కౌంట్ డౌన్ స్టార్ట్ చేయాలని చూస్తున్నట్లుగా ఉంది. తన గెలుపు ఖాయం, మెజారిటీ ఎంత అన్నదే చర్చ అని రాజు గారు మీసం మెలేస్తున్నారు అంటే అంటే మ్యాటర్ చాలానే ఉంది అనుకోవాలి.

మరో వైపు అన్ని పార్టీలు తన గెలుపు కోసం కలసి రావాలని ఆయన పిలుపు ఇస్తున్నారు. ఏపీలో రావణ పాలనను అంతం చేయడానికి విపక్ష రాజకీయం అంతా ఏకం కావాలని ఆయన కోరుకుంటున్నారు. దానికి తగినట్లుగానే ఆయన చురుకుగా పావులు కదుపుతున్నారు. మరో వైపు నర్సాపురంలోని క్షత్రియ సామాజికవర్గం మద్దతు ఆయనకు దన్నుగా ఉంది అంటున్నారు. అలాగే మరో బలమైన కాపులు కూడా ఏకమైతే రాజు గారి విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు అని తెలుస్తోంది.

అదే సమయంలో అధికారంలో ఉన్న వైసీపీకి అభ్యర్ధి సరైన వారు దొరకాలి. రాజు ఏ విధంగా చూసినా ఇపుడు పాపులర్ అయిపోయారు. ఆయన ఈటెల రాజేందర్ మాదిరిగా ఉప ఎన్నికల్లో సవాల్ చేసి మరీ గెలిస్తే కనుక జగన్ సర్కార్ కి పొలిటికల్ గా ఇబ్బందులు మొదలైనట్లే. సాధారణంగా ఎవరైతే సవాల్ చేసి బరిలోకి దిగుతారో వారి మీదనే ఫోకస్ మొత్తం ఉంటుంది. అదే విధంగా జనాల మొగ్గు కూడా వారి మీదనే ఉంటుంది.

ఆ సమయంలో అవతల పక్షం ఎవరు అన్నది కూడా జనాల మైండ్ లో సెకండరీ అవుతుంది. పైగా అవతల వారు డిఫెన్స్ ఆడాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మాత్రం కచ్చితంగా సవాల్ చేసి గెలిచిన వారే ఎక్కువగా కనిపిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే నాడు కేసీయార్ అయినా జగన్ అయినా నిన్నటికి నిన్న ఈటెల అయినా కూడా ఇలాంటి సవాళ్ళ సెగను రాజేసే తమ రాజకీయాన్ని రక్తి కట్టించుకున్నారు.

మొత్తానికి రాజు కూడా రాజకీయాన్ని పూర్తిగా ఇపుడు తనకు అనుకూలంగా అన్నీ చేసుకుంటున్నారు. ఆయనకు ఆయనే రాజీనామా చేయడం ద్వారా ముగ్గులోకి ఆయనే కోరి మరీ జగన్ని లాగుతున్నారు. ఇదే పొలిటికల్ గా ఆయనకు బిగ్ అడ్వాంటేజ్ అవుతుంది అన్న విశ్లేషణలు ఉన్నాయి.