Begin typing your search above and press return to search.

సజ్జలను కార్నర్ చేసిన రఘురామ!

By:  Tupaki Desk   |   7 Oct 2021 7:59 AM GMT
సజ్జలను కార్నర్ చేసిన రఘురామ!
X
అధికార వైసీపీ త‌ర‌పున‌ ఎంపీగా గెలిచి ఇప్పుడు ఆ పార్టీపైనే తిరుగుబాటు చేస్తున్న న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు ఆ పార్టీ నాయ‌కును లక్ష్యంగా చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సీఎం జ‌గ‌న్‌, ఎంపీ విజ‌య సాయిరెడ్డి బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని సీబీఐ కోర్ట‌ను ఆశ్ర‌యించి భంగ‌ప‌డ్డ ఆయ‌న‌.. ఆ త‌ర్వాత పార్టీలో ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన స‌జ్జ‌ల రామకృష్ణ‌ను టార్గెట్ చేశార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న స‌జ్జ‌ల త‌న విధులు మీరుతున్నార‌ని వైసీపీ పార్టీ ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌త్రికా స‌మావేశాలు ప్ర‌క‌ట‌న‌లు చేయ‌కుండా నిలువ‌రించాల‌ని రాష్ట్ర సివిల్ స‌ర్వీస్ నిబంధ‌న‌ల మేర‌కు చ‌ర్చ‌లు తీసుకునేలా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ఆదేశించాల‌ని హైకోర్టులో ర‌ఘురామ దాఖ‌లు చేసిన ప్ర‌జా ప్ర‌యోజన వ్యాజ్యం తాజాగా విచార‌ణ‌కు వ‌చ్చింది.

ఈ పిల్‌పై విచార‌ణ చేప‌ట్టిన ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి జ‌స్టిస్ ఎన్‌. జ‌య‌సూర్య‌తో కూడిన ధ‌ర్మాస‌నం రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల నియామ‌కానికి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసిన జీవోతో పాటు రాష్ట్ర సివిల్ స‌ర్వీస్ నిబంధ‌న‌ల‌ను న్యాయ‌స్థానం ముందుంచాల‌ని ర‌ఘురామ త‌ర‌పు న్యాయ‌వాదిని ఆదేశించింది. స‌జ్జ‌ల‌ను ప్ర‌జా సంబంధాల స‌ల‌హాదారుగా నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఆయ‌న‌కు కేబినేట్ హోదా క‌ల్పించింద‌ని ప్ర‌భుత్వ జీతం ఇత‌ర ప్ర‌యోజ‌నాలు పొందుతున్న ఆయ‌న సివిల్ స‌ర్వీస్ నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా వైసీపీ ప్ర‌తినిధిగా వ్య‌వ‌హ‌రిస్తూ మీడియా స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నార‌ని పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది శ్రీవెంక‌టేశ్ వాద‌న‌లు వినిపించారు. దీనిపై స్పందించిన ధ‌ర్మాస‌నం స‌జ్జ‌ల నియామ‌క‌పు జీవో కోర్టు రికార్డుల్లో లేద‌ని అభ్యంత‌రం తెలిపింది. నియామ‌క జీవో సివిల్ స‌ర్వీసెస్ నిబంధ‌న‌ల‌ను స‌మ‌ర్పించాల‌ని ఆదేశిస్తూ విచార‌ణ‌ను ద‌స‌రా సెల‌వుల త‌ర్వాత‌కు వాయిదా వేసింది.

ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌న ప్ర‌భుత్వం నుంచి నెల‌కు రూ.2.50 ల‌క్ష‌ల జీతం తీసుకుంటున్నార‌ని ఒకటి. దీనికి అద‌నంగా మ‌రిన్ని బాధ్య‌త‌ల పేరుతో మ‌రో రూ.2.5 ల‌క్ష‌లు పొందుతున్నార‌ని అన్నది మరొకటి. ప్ర‌భుత్వం ప్ర‌జా సంబంధాల స‌ల‌హాదారుడిగా నియ‌మించిన స‌జ్జ‌ల ప్ర‌భుత్వం నుంచి వేత‌నం పొందుతున్నారు కాబ‌ట్టి ఏపీ సివిల్ స‌ర్వీసెస్ నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయ‌ని పేర్కొంటూ ర‌ఘురామ గ‌తంలో ఈ పిల్ వేశారు. ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ఉన్న స‌జ్జ‌ల వైసీపీ పార్టీకి చెందిన నాయ‌కుడ‌ని ఆయ‌న ఇప్పుడు పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగానూ మూడు జిల్లాల‌కు ఇంఛార్జ్ గానూ ప‌ని చేస్తున్నార‌ని ర‌ఘుర‌మ పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు బాధ్య‌త‌ల్లో ఉంటూ పార్టీ కార్యాల‌యం నుంచి మీడియా స‌మావేశాలు నిర్వ‌హిస్తూ రాజ‌కీయ పాత్ర పోషిస్తున్నారంటూ ర‌ఘురామ ఆరోపించారు. స‌ల‌హాదారుడిగా ఉన్న ఆయ‌న నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ పిటిష‌న్‌లో పొందుప‌రిచారు. వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న స‌జ్జ‌ల‌పై చ‌ర్య‌లు తీసుకునేలా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ఆదేశించాల‌ని ర‌ఘురామ కోర్టును కోరారు. స‌ల‌హాదారుల‌కు ప్ర‌త్యేక నియామ‌వ‌ళి లేద‌ని పేర్కొన్న ఆయ‌న‌.. వారికి సివిల్ స‌ర్వీసెస్ నిబంధ‌న‌లే వ‌ర్తిస్తాయ‌ని చెప్పారు.