Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు ఇళ్లు అక్ర‌మ నిర్మాణ‌మా

By:  Tupaki Desk   |   7 Sep 2015 5:44 AM GMT
చంద్ర‌బాబు ఇళ్లు అక్ర‌మ నిర్మాణ‌మా
X
ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ఏపీ రాజ‌ధానిలో ఉండేందుకు తీసుకున్న ఇళ్లు అక్ర‌మ నిర్మాణ‌మంటూ ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. చంద్ర‌బాబు ఏపీ ప‌రిపాల‌నా వ్య‌వ‌హారాలు, రాజ‌ధాని నిర్మాణం శ‌ర వేగంగా జ‌రిగేలా హైద‌రాబాద్ నుంచి కో ఆర్టినేట్ చేయ‌డం క‌ష్ట‌మ‌వుతోంది. అలాగే ఆయ‌న త‌న కుటుంబంతో ప‌ది ప‌దిహేను రోజుల‌కు ఒక‌సారి మాత్ర‌మే గ‌డుపుతున్నారు. దీంతో చంద్ర‌బాబు కుటుంబ స‌మేతంగా హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు షిఫ్ట్ అయ్యారు.

గుంటూరు జిల్లా ఉండ‌వ‌ల్లి పంచాయ‌తీ ప‌రిధిలోని కృష్ణా క‌ర‌క‌ట్ట‌ పై ఆయ‌న ఓ అనువైన గృహాన్ని ఎంపిక‌చేసుకున్నారు. గ‌త నెల 29న చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి కూడా ఈ ఇంట్లో పాలు పొంగించారు. అయితే గ‌తంలో ఇది అక్ర‌మ క‌ట్ట‌డ‌మంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చార‌ని...ఈ ఇంటికి నోటీసులు ఇచ్చి ఆరు నెల‌లు కూడా కాకుండానే ఇప్పుడు చంద్ర‌బాబు మ‌కాం వేయ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని బాప‌ట్ల వైకాపా ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తి ప్ర‌శ్నిస్తున్నారు.

చంద్ర‌బాబు విష‌యంలో సామాన్యుడికి ఒక రూలు..సీఎంకు ఒక రూలా అని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. ముఖ్య‌మంత్రి బ‌స చేస్తే అక్ర‌మ నిర్మాణం స‌క్ర‌మ నిర్మాణం అయిపోతుందా అని కోన ప్ర‌శ్నించారు. రాష్ర్టం నానా ఇబ్బందుల్లో ఉంటే చంద్ర‌బాబు హైద‌రాబాద్ స‌చివాల‌యానికి కోట్లు ఖ‌ర్చు పెట్టి ఇప్పుడు ఏపీ రాజ‌ధానిలో ఇంటి నిర్మాణానికి కూడా కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ప్ర‌జాధ‌నం దుర్వినియోగం చేయ‌కూడ‌ద‌న్న చిత్త‌శుద్ధి చంద్ర‌బాబుకు ఉంటే ఆయ‌న నిజంగా ప్ర‌భుత్వ స్థ‌లంలో ఇళ్లు నిర్మించుకోవ‌చ్చ‌ని..కాని లింగ‌మ‌నేని ర‌మేష్‌కు చెందిన ఈ ఇంటిని తీసుకుని దానికి హంగులు అద్ద‌డానికి ఏకంగా రూ.20 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

గ‌తంలో భారీ నీటిపారుద‌ల శాఖా మంత్రి దేవినేని ఉమ కూడా కృష్ణాన‌దిలో బోటు ద్వారా ఈ అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను ప‌రిశీలించి..వాటి సంగ‌తి తేలుస్తామ‌న్నారు. ఇప్పుడు చంద్ర‌బాబు కూడా ఉమ ఆరోపించిన అక్ర‌మ క‌ట్ట‌డంలోనే బ‌స చేశారు. ఇటు వైకాపా విమ‌ర్శ‌ల దాడి కూడా ప్రారంభ‌మైంది. మ‌రి చంద్ర‌బాబు అదే గృహంలో ఉంటారా..లేదా మ‌రో చోట‌కు మ‌కాం మారుస్తారా అన్న‌ది చూడాలి.