Begin typing your search above and press return to search.

బుధవారం రాత్రి వేళ.. రఘురామ భార్య.. పిల్లలకు టైమిచ్చిన అమిత్ షా

By:  Tupaki Desk   |   20 May 2021 5:30 AM GMT
బుధవారం రాత్రి వేళ.. రఘురామ భార్య.. పిల్లలకు టైమిచ్చిన అమిత్ షా
X
అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నరసాపురం ఎంపీ.. వైసీపీ రెబల్ నేత రఘురామ కృష్ణరాజు సతీమణి.. ఆయన పిల్లలు బుధవారం రాత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రఘురామ అక్రమ అరెస్టు.. పోలీసులు అదుపులోకి తీసుకోవటం..ఆపై గుర్తు తెలియని అధికారులు దాడి చేయటం.. సుప్రీంకోర్టు ఆదేశాలు.. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైనానికి సంబంధించిన ప్రతి అంశాన్ని అమిత్ షా ద్రష్టికి తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను అమిత్ షాకు రఘురామ పిల్లలు ఇందు ప్రియదర్శిని.. భరత్ లు వివరించారు. వినతిపత్రాన్ని అందజేసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వాన్ని.. ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని ఉద్దేశపూర్వకంగా ఎంపీ రఘురామ తన మాటలతో రెచ్చగొడుతున్నారంటూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి అరెస్టు చేయటం తెలిసిందే. విచారణ సమయంలో రఘురామ మీద దాడి జరిగిందని.. ఆయన్ను తీవ్రంగా కొట్టారన్న ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ వాదనకు బలం చేకూరేలా కాళ్ల మీద దెబ్బలున్నట్లుగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి.

రఘురామ అరెస్టుపై భిన్నాభిప్రాయాలువ్యక్తమవుతున్నాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తూ ఉంటే.. చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో రఘురామ విమర్శలు ఇరు వర్గాల మధ్య చిచ్చు రేపేలా ఉన్నాయని విమర్శిస్తున్నారు. అయితే.. రఘురామను వేలెత్తి చూపే వెర్షన్ మాత్రమే చూపిస్తున్నారు తప్పించి.. ఆయన్ను ఇష్టానుసారం తిట్టిన వారి గురించి.. ఆయన్ను రెచ్చగొట్టిన వారి గురించి మాట్లాడరేమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏమైనా.. రఘురామ ఎపిసోడ్ లోకి కేంద్రమంత్రి అమిత్ షా ఎంట్రీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రఘురామ కుటుంబ సభ్యులకు అమిత్ షా టైమిచ్చిన వైనం ప్రాధాన్యత సంతరించుకున్నట్లుగా చెప్పాలి. ఏమైనా.. ఈ వ్యవహారంలో అనూహ్య పరిణామాలకు అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.