Begin typing your search above and press return to search.

ఆర్ బీఐ గవర్నర్ పై స్వామి ఫైరింగ్

By:  Tupaki Desk   |   12 May 2016 10:00 AM GMT
ఆర్ బీఐ గవర్నర్ పై స్వామి ఫైరింగ్
X
సుబ్రమణ్య స్వామి ఎంతటి ఫైర్ బ్రాండో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి రాజ్యంగ పదవి లేనప్పుడే.. తన ఆరోపణలతో అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి చుక్కలు చూపించిన ఆయన.. తాజాగా రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కావటం తెలిసిందే. ఎంపీగా అయిన నాటి నుంచి రాజ్యసభలో కాంగ్రెస్ నేతల్ని బంతాట ఆడుకుంటున్న స్వామి పుణ్యమా అని కాంగ్రెస్ నేతలకు బీపీ అమాంతం పెరిగిపోతోంది. ఆగస్టా స్కాం విషయంలో ఇంత రచ్చ వెనుక స్వామి పాత్రను తక్కువ చేసి చూపించలేం.

అలాంటి ఆయన.. తాజాగా ఆర్ బీఐ గవర్నర్ రఘురామ రాజన్ పై టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. పార్లమెంటు ఆవరణలో రాజన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన స్వామి మాటలతో ఇప్పుడు వాతావరణం మరింత వేడెక్కింది. యూపీఏ హయాంలో ఆర్ బీఐ గవర్నర్ గా రాజన్ ను తీసుకొచ్చి పెట్టటం తెలిసిందే. మోడీ విధానాలకు.. రాజన్ కు మధ్య సానుకూల సంబంధాలు లేవన్న వార్తలు జోరుగా వస్తున్న సమయంలోనే స్వామి టార్గెట్ చేయటం గమనార్హం.

రాజన్ భారతదేశానికి అనుకూలురు కాదన్నట్లుగా ఆయన వైఖరి చూస్తే కనిపిస్తోందంటూ మంట పుట్టే మాటలు మాట్లాడిన స్వామి.. ఆర్ బీఐ గవర్నర్ ఆర్థిక విధానాల మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో నిరుద్యోగం పెరగటానికి.. ఆయన తప్పుడు విధానాలే కారణంగా చెప్పిన స్వామి.. ఆయన్ను తక్షణమే విధుల నుంచి తప్పించాలంటూ డిమాండ్ చేశారు. వడ్డీ రేట్లు పెంచాలన్న నిర్ణయం మంచిది కాదని.. ఆ ఫలితం దేశం అనుభవిస్తుందన్న స్వామి.. ఆయనకు సెలవిచ్చి ఎంత త్వరగా చికాగో పంపిస్తే అంత మంచిదంటూ మండిపడ్డారు. స్వామి మాటల నేపథ్యంలో రాజన్ కానీ నొచ్చుకుంటే.. ఆర్ బీఐ గవర్నర్ గా కొత్త ముఖం తెర మీదకు రావటం అనివార్యం. స్వామి మాటలు చూస్తుంటే.. ఆయన భుజాల మీద పెట్టి మోడీ ఫైరింగ్ చేస్తున్నట్లు కనిపించట్లేదు..?