Begin typing your search above and press return to search.

పెద్ద‌నోట్ల ర‌ద్దు ఎంత చెత్త ఆలోచ‌నో చెప్పాడు

By:  Tupaki Desk   |   13 April 2018 4:59 AM GMT
పెద్ద‌నోట్ల ర‌ద్దు ఎంత చెత్త ఆలోచ‌నో చెప్పాడు
X
దేశ వ్యాప్తంగానే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాలు ఆశ్చ‌ర్య‌పోయేలా చేశారు ప్ర‌ధాని మోడీ. ఊహించ‌నిరీతిలో పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని తీసుకున్న ఆయ‌న‌.. తాను తీసుకున్న నిర్ణ‌యంతో దేశ ఆర్థిక వ్య‌స్థ‌లో అనూహ్య‌మైన మార్పుతో పాటు.. అవినీతి సొమ్ము పెద్ద ఎత్తున ప్ర‌భుత్వ ప‌రం అవుతుంద‌ని చెప్పిన మాట‌ల్ని ప్ర‌జ‌లంతా న‌మ్మారు. ఈ కార‌ణంతోనే తాము తీవ్ర అవ‌స్థ‌ల‌కు గురైన‌ప్ప‌టికీ.. దేశ ప్ర‌జ‌లు మోడీ తీసుకున్న పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని అండ‌గా నిలిచారు.

అయితే.. ఆయ‌న చెప్పినట్లుగా ఏమీ జ‌ర‌గ‌క‌పోవ‌టం.. పెద్ద‌నోట్ల ర‌ద్దు కార‌ణంగా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ కుంటుప‌డ‌టంపై విమ‌ర్శ‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. మ‌రోవైపు మోడీ చెప్పిన‌ట్లుగా పెద్ద‌నోట్ల ర‌ద్దు ఫ‌లాలు ఏమీ ప్ర‌జ‌ల‌కు క‌నిపించ‌క‌పోవ‌టంతో మోడీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యంపై అసంతృప్తి వ్య‌క్త‌మవుతోంది.

ఇలాంటివేళ‌.. మాజీ ఆర్ బీఐ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామ్ రాజ‌న్ త‌న‌దైన శైలిలో తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం ఎంత చెత్త ఆలోచ‌న అన్న‌ది వివ‌రంగా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం మంచి ఆలోచ‌న ఎంత‌మాత్రం కాద‌న్న విష‌యాన్ని తాను గ‌తంలోనే చెప్పాన‌ని చెప్పారు.

వ్య‌వ‌స్థ‌లోని 87.5 శాతం విలువైన క‌రెన్సీ నోట్ల‌ను ర‌ద్దు చేసే ప్ర‌క్రియ త‌గిన ప్ర‌ణాళిక లేకుండా చేప‌ట్టిన‌ట్లుగా ఆయ‌న తేల్చి చెప్పారు. ప్ర‌స్తుతం షికాగో యూనివ‌ర్సిటీలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెస‌ర్ గా రాజ‌న్ విధులు నిర్వ‌ర్తిస్తున్నారు.

హార్వ‌ర్డ్ కెనడీ స్కూల్లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మాట్లాడిన రాజ‌న్.. పెద్ద‌నోట్లు నిర్ణ‌యాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

రాజ‌న్ చేసిన విమ‌ర్శ‌ల్లో కీల‌క అంశాలు చూస్తే..

+ 2016 నవంబర్‌ 8న మోదీ ప్రభుత్వం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటి స్థానంలో కొత్తగా మళ్లీ రూ.2,000 - రూ.500 నోట్లను వెంటనే ప్రవేశపెట్టారు. తర్వాత రూ.200 నోటును కూడా తీసుకొచ్చారు. అయితే, తగినన్ని నోట్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు పడరాని పాట్లుపడ్డారు.

+ వ్యవస్థలో ఉన్న 87.5 శాతం విలువైన నోట్లను రద్దు చేయాలంటే ముందుగా దానికి తగ్గట్టుగా కరెన్సీ నోట్లను ముద్రించి చలామణీలోకి తీసుకొచ్చేందుకు సిద్ధపడాలి. ఏ ఆర్థికవేత్త అయినా ఇదే చెబుతారు. అయితే, భారత ప్రభుత్వం ఇలాంటి కసరత్తును పూర్తిగా చేయకుండానే ఆదరాబాదరాగా డీమోనిటైజేషన్‌ను ప్రకటించింది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది.

+ పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణయంతో ప్రజలు నల్ల ధనాన్ని నేలమాళిగల్లోంచి బయటకు తెచ్చేసి, లెంపలేసుకొని పన్నులు కట్టేస్తారనేది ప్రభుత్వం ఆలోచన. అయితే, ఇది అవివేకమైన నిర్ణయం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రజలు కొత్త వ్యవస్థలకు వేగంగా అలవాటుపడిపోయి, కొత్త దారులు వెతుక్కుంటారన్న విషయాన్ని ప్రభుత్వం మరిచిపోయింది.

+ రద్దు చేసిన నోట్లకు సమానమైన మొత్తం వ్యవస్థలోకి మళ్లీ తిరిగివచ్చేసిందంటే, ప్రభుత్వం ఏ ఉద్దేశంతో దీన్ని చేపట్టిందో అది నెరవేరనట్టే లెక్క. కరెన్సీకి కటకటతో ప్రజలు ఇబ్బందుల పాలు కావడం ఒకెత్తు అయితే, ఆర్థిక కార్యకలాపాలు స్తంభించడంతో అసంఘటిత రంగంలో భారీగా ఉద్యోగాలు ఊడిపోయాయి. అయితే, దీర్ఘకాలంలో దీనివల్ల ఎలాంటి ప్రభావం పడుతుందనేది వేచి చూడాలి.

+ నా వరకూ అయితే.. పెద్ద‌నోట్ల రద్దు అనేది నిరుపయోగంగా భావించా. వస్తు సేవల పన్ను(జీఎస్‌ టీ)ను మెరుగ్గా అమలు చేయగలిగితే భారత్‌ ఆర్థిక వ్యవస్థకు మంచిదే.