Begin typing your search above and press return to search.

ఇంట‌రెస్టింగ్‌!...యూఎస్ ఫెడ్ చీఫ్ రేసులో రాజ‌న్‌!

By:  Tupaki Desk   |   1 Nov 2017 4:32 AM GMT
ఇంట‌రెస్టింగ్‌!...యూఎస్ ఫెడ్ చీఫ్ రేసులో రాజ‌న్‌!
X
ర‌ఘురామ‌రాజ‌న్ గుర్తున్నారా?... అబ్బే లేదు అనే స‌మాధాన‌మే రాదు. ఎందుకంటే భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంకు (రిజ‌ర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా)కు గ‌వ‌ర్న‌ర్‌గా త‌న‌దైన శైలిలో ప‌ని చేసి ప్ర‌శంస‌లు అందుకున్న రాజ‌న్‌ ను మ‌నం మ‌రిచిపోతే క‌దా... గుర్తు చేసుకోవ‌డానికి అన్న స‌మాధాన‌మే వినిపిస్తుంది. యూపీఏ హ‌యాంలో ఎక్క‌డో విదేశాల్లో ఆర్థిక శాస్త్ర ఆచార్యుడిగా ప‌నిచేస్తున్న రాజ‌న్ ను... అప్ప‌టి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ 2013లో రిజ‌ర్వ్ బ్యాంకు గ‌వ‌ర్న‌ర్‌ గా నియ‌మించారు. చాలా చిన్న వ‌య‌సులోనే ఆర్థిక శాస్త్రంలో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతిగాంచిన ప్రొఫెస‌ర్‌ గా పేరు తెచ్చుకున్న రాజ‌న్ రాక‌తో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ గాడిన ప‌డుతుంద‌ని అంద‌రూ భావించారు. అయితే అత్యంత క్లిష్ణ‌త‌తో కూడిన భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప‌క్కాగా గాడిలో పెట్టే విష‌యంలో రాజ‌న్ అంత‌గా స‌క్సెస్ కాలేక‌పోయిన‌ప్ప‌టికీ... అప్ప‌టిదాకా ప‌నిచేసిన గ‌వ‌ర్న‌ర్లంద‌రి కంటే కూడా మెరుగైన ప‌నితీరునే క‌న‌బ‌రిచార‌న్న మాట మాత్రం వినిపించింది.

అయితే రాజ‌న్‌ కు ఆర్బీఐ పగ్గాలు ఇచ్చిన యూపీఏ స‌ర్కారు అధికారం కోల్పోవ‌డం, కొత్త‌గా న‌రేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్ర‌భుత్వ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డంతో ప‌రిస్థితి తారుమారైంది. రాజ‌కీయాల‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన ఆర్థిక వేత్త‌ల‌కు కూడా ఇబ్బందులు వ‌చ్చేశాయి. అప్ప‌టిదాకా ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌ గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన వారంతా రెండో ప‌ర్యాయం కూడా అవ‌కాశం ద‌క్కించుకోగా... విచిత్రంగా ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఆర్థిక వేత్త‌గా పేరుగాంచిన రాజ‌న్‌ కు మాత్రం ఎన్డీఏ స‌ర్కారు ఆ అవ‌కాశం ఇవ్వ‌లేద‌నే చెప్పాలి. ఫ‌లితంగా తొలి టెర్మ్ పూర్తి చేసుకున్న త‌ర్వాత చాలా అవ‌మాన‌క‌ర‌మైన రీతిలో రాజ‌న్ ప‌ద‌వీ విర‌మ‌ణ చేయాల్సి వ‌చ్చింది. ఆర్బీఐ గ‌వ‌ర్నర్ గిరీ ప‌ద‌వి నుంచి దిగిపోయిన వెంట‌నే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా... తాను పాఠాలు చెప్పుకుంటున్న అమెరికా యూనివ‌ర్సిటీకి రాజ‌న్ వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయ‌న అక్క‌డి యూనివ‌ర్సిటీ ఆఫ్ చికాగోలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌ లో పాఠాలు చెప్పుకుంటూ కాలం వెళ్ల‌దీస్తున్నారు.

అయినా ఇప్పుడు రాజ‌న్ ప్ర‌స్తావ‌న ఎందుకు వ‌చ్చిందంటే... అగ్ర‌రాజ్యంగా ప్ర‌పంచ దేశాలు పిలుచుకుంటున్న అమెరికాకు కూడా భార‌త్ లానే ఓ సెంట్ర‌ల్ బ్యాంకు ఉంది. అదే యూఎస్ ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్. దానినే మ‌నం షార్ట్‌ గా యూఎస్ ఫెడ్‌ గా పిలుచుకుంటున్నాం. అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు కేంద్ర బిందువుగా ఉన్న ఈ బ్యాంకు చీఫ్‌ గా వ్య‌వ‌హ‌రిస్తున్న జానెట్ ఎల్లెన్ వ‌చ్చే ఏడాది ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. మ‌రి ఎల్లెన్ వెళ్లిపోయిన త‌ర్వాత ఆ ప‌దవి ఎవ‌రిని వ‌రిస్తుంది? అన్న ప్ర‌శ్న ఇప్పుడు అమెరికా వ్యాప్తంగానే కాకుండా ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌కు చెందిన ఆర్థిక వేత్త‌ల మ‌దిలో మెద‌లుతోంది. త్వ‌ర‌లోనే ఎల్లెన్ స్థానంలో కొత్త చీఫ్‌ ను అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించ‌నున్నార‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే రాజ‌న్ పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. యూఎస్ ఫెడ్ చీఫ్ గా రాజ‌నే నియ‌మితుల‌వుతార‌ని కూడా ప‌లువురు అంచ‌నా వేస్తున్నారు.

ఈ దిశ‌గా ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ చేసిన ప్ర‌ముఖ మేగ‌జీన్ *బ్యారెన్‌* పెద్ద క‌థ‌నాన్నే రాసింది. 40 ఏళ్ల వ‌య‌సుకే అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి సంస్థ‌(ఐఎంఎఫ్‌)లో చీఫ్ ఎకాన‌మిస్ట్ ప‌ద‌విని చేప‌ట్టిన రాజ‌న్‌కు మించి మంచి ఆర్థిక వేత్త ఎవ‌రున్నార‌న్న కోణంలో ఆ క‌థ‌నాన్ని రాసిన ఆ మేగ‌జీన్‌... యూఎస్ ఫెడ్ చీఫ్ రేసులో రాజ‌నే అంద‌రికంటే ముందు ఉన్నార‌ని సంచ‌ల‌న విశ్లేష‌ణ‌ను ప్ర‌చురించింది. అమెరికాను అత‌లాకుత‌లం చేసిన ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ప్రిడిక్ట్ చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన రాజ‌న్‌ కు అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై సంపూర్ణ అవ‌గాహ‌న ఉంద‌ని, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో యూఎస్ ఫెడ్ చీఫ్‌ గా రాజ‌న్ ను మించి మంచి ఆర్థిక వేత్త ల‌భించ‌ర‌ని కూడా ఆ మేగ‌జీన్ త‌న క‌థ‌నంలో అభిప్రాయ‌ప‌డింది. మ‌రి ఆ ప‌త్రిక క‌థ‌నం నిజ‌మే అయితే... అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు దిశానిర్దేశం చేసే బాధ్య‌త తొలిసారిగా ఓ భార‌తీయుడికి ద‌క్కిన‌ట్ట‌వుతుంది. చూద్దాం ఏం జ‌రుగుతుందో.