Begin typing your search above and press return to search.

సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో మంగళవారం ఏం జరిగింది?

By:  Tupaki Desk   |   19 May 2021 3:31 AM GMT
సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో మంగళవారం ఏం జరిగింది?
X
నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేయటం.. తదనంతర పరిణామాలు.. సుప్రీంకోర్టు ఆదేశాలతో గుంటూరు జిల్లా జైల్లో ఉన్న ఆయన్ను సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించటం లాంటివి తెలిసిందే. సోమవారం రాత్రి పదకొండు గంటలకు ఆర్మీ ఆసుపత్రికి చేరుకున్న ఆయనకు.. మంగళవారం మొత్తం వైద్యుల పరీక్షలు.. ఆయనకు అవసరమైన చికిత్స చేసినట్లుగా తెలుస్తోంది. ఆసుపత్రికి చేరుకున్న వెంటనే ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు.

మంగళవారం ఉదయం నుంచి ఆయనకు పూర్తిస్థాయిలో పరీక్షలు.. చికిత్స షురూ చేసినట్లుగా సమాచారం. ఆసుపత్రిలోని వీఐపీ స్పెషల్ రూంల్ ముగ్గురు ఆర్మీ వైద్య అధికారుల టీం ఆయనకు ఆరోగ్య పరీక్షల్ని నిర్వహించినట్లుగా తెలుస్తోంది. పోలీసుల కస్టడీలో ఉన్న వేళలో తనపై దాడి జరిగినట్లుగా రఘురామ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. రెండు కాళ్లల్లో కుడి కాలికి తీవ్రమైన వాపు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. దాని నొప్పి తగ్గించటానికి వైద్యులు పరీక్షలు జరిపి.. మందులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఆయన నుంచి సేకరించిన రక్త నమూనాల్ని ల్యాబ్ కు పంపినట్లుగా చెబుతున్నారు. మరోవైపు సుప్రీం ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు తమ రిజిస్ట్రార్ ను జ్యూడీషియల్ అధికారిగా నియమించారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ వైద్య పరీక్షలు.. చికిత్స కార్యక్రమం జరిగినట్లుగా తెలుస్తోంది. అత్యున్నత కోర్టు ఆదేశాల నేపథ్యంలో.. మొత్తం జరిగిన అంశాల్ని అవసరమైన మేరకు వీడియోలు తీసినట్లుగా చెబుతున్నారు.

మరికొన్ని పరీక్షల్ని బుధవారం కూడా చేయాల్సి ఉంటుందని.. రిపోర్టులు వచ్చిన తర్వాత.. వాటిని పరిశీలించి.. తాము ఇస్తున్న వైద్యంతో పాటు.. రఘురామ ఆరోగ్యానికి సంబంధించిన రిపోర్టును ఈ నెల ఇరవై ఒకటిన సుప్రీంకోర్టుకు అందజేస్తారని చెబుతున్నారు. రఘురామ ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్ని క్లుప్తంగా ఒక నోట్ రూపంలో విడుదల చేశారు ఆర్మీ అధికారులు.

ఆయనకు చేస్తున్న చికిత్స.. ఇతర అంశాల విషయంలో గోప్యతను పాటిస్తున్నాయి. వాస్తవానికి.. ఆర్మీ వర్గాలు.. వారికి సంబంధించిన యాక్టివిటీకి సంబంధించిన అంశాలు బయటకు రావటమే తక్కువ. తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రూల్ కు తగ్గట్లుగా వ్యవహరిస్తూ.. గోప్యతను పాటిస్తున్నాయి. ప్రోటోకాల్ ప్రకారం అన్ని అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా రఘురామకృష్ణంరాజు పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.