Begin typing your search above and press return to search.

రఘురామ కేసులో కీలక పరిణామం.. ప్రతివాదిగా ఏపీ ప్రభుత్వం తొలగింపు

By:  Tupaki Desk   |   26 May 2021 4:30 AM GMT
రఘురామ కేసులో కీలక పరిణామం.. ప్రతివాదిగా ఏపీ ప్రభుత్వం తొలగింపు
X
నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గాయాలపై సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంలో దాఖలైన పిటిషన్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ ప్రభుత్వాన్ని.. ఏపీ ప్రభుత్వాధినేతను దూషించటం.. కులాలు.. మతాలు.. వర్గాల మధ్య చిచ్చు రేపేలా.. వారిని రెచ్చగొట్టేలా రఘురామ వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ సీఐడీ ఆయన్ను అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి గుంటూరు తరలించటం.. పోలీసుల కస్టడీలో ఆయనపై గుర్తు తెలియని అధికారులు కొట్టినట్లుగా ఆరోపణలు బయటకు వచ్చి సంచలనంగా మారాయి.

రఘురామ బెయిల్ పిటీషన్ పై నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవటం.. చివరకు ఆయనకు బెయిల్ రావటం.. గుంటూరు జైలు నుంచి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి ఆయన్ను తరలించటం తెలిసిందే. తాజాగా రఘురామ కుమారుడు భరత్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ పోలీసుల కస్టడీలో తన తండ్రిని హింసించారని.. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ రఘురామ కుమారుడు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది.

భరత్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తే.. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. రోహత్గి వాదనలు వినిపిస్తూ.. తొలుత ప్రతివాదులుగా చేర్చిన ఏపీ ప్రభుత్వం.. మంగళగిరి స్టేషన్ హౌస్ ఆఫీసర్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సీఐడీ ఏడీజీ పీవీ సునీల్ కుమార్.. సీడీఐ ప్రాంతీయ కార్యాలయం ఏసీపీ విజయపాల్ ను ప్రతివాదులుగా తొలగించాలని కోరారు. దీనిపై ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న దుష్యంత్ దవే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినకుండా సీబీఐని ఏ రకంగా ప్రతివాదిగా చేరుస్తారని ప్రశ్నించారు.

ప్రతివాదుల తొలగింపుపై పిటిషనర్ తరఫు న్యాయవాది రిస్కు భరిస్తారని అంగీకరించారని సుప్రీం తెలిపింది. న్యాయవాది దవేకు లోకస్ స్టాడీ లేదని.. ఏపీ ప్రభుత్వాన్ని తొలగించాలని రోహత్గి పేర్కొనటంపై ఏపీ సర్కారు తరఫు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సుప్రీం.. ఈ కేసులో చాలా అంశాలు ఉన్నాయని.. ఆసక్తిగా ఉన్న పార్టీల వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వమని.. కావాలంటే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. కేంద్రానికి.. సీబీఐకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈ లోపు ప్రతివాదులు ఇద్దరు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తాజా పరిణామం సరికొత్తగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. దీనిపై ఏపీ ప్రభుత్వం మరెలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.