Begin typing your search above and press return to search.

రఘురామపై వేటు వేయండి.. స్పీకర్ కు వైసీపీ లేఖ

By:  Tupaki Desk   |   24 Jun 2021 7:30 AM GMT
రఘురామపై వేటు వేయండి.. స్పీకర్ కు వైసీపీ లేఖ
X
అధినేతను టార్గెట్ చేయటంతో పాటు.. పార్టీ ఇమేజ్ ను అదే పనిగా డ్యామేజ్ చేస్తూ.. దుర్మార్గంగా వ్యవహరిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై వేటు వేయాలని కోరుతూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. నిజానికి రఘురామపై వేటు వేయాలని కోరుతూ స్పీకర్ ను ఆ మధ్యన కలిసి మరీ విన్నవించుకోవటం తెలిసిందే. గత ఏడాది జులై మూడున స్పీకర్ ను కలిసి రఘురామపై ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆయనపై వేటు వేయాలని కోరారు.

అయినప్పటికీ ఆ అంశంపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ తాజాగా స్పీకర్ ఓం బిర్లాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. ఆర్టికల్ 10 ప్రకారం పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్న రఘురామను డిస్ క్వాలిఫై చేయాలని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి కోరుతున్నారు. తాజాగా రాసిన లేఖలో ఆయన.. గతంలో తాము చేసిన వినతుల్ని ప్రస్తావించారు.

రఘురామ డిస్ క్వాలిపై పై ఇప్పటికే పలుమార్లు విన్నవించామని.. ఈ నెల పదకొండున కూడా రిమైండర్ పిటిషన్ వేసిన వైనాన్ని గుర్తు చేశారు. అనర్హత పిటిషన్ ఇచ్చి 11 నెలలు అవుతుందని.. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు. తాజా లేఖపై స్పీకర్ ఓం బిర్లా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.