Begin typing your search above and press return to search.

జగన్ అభిమానిగా మారిపోయిన ఎంపి

By:  Tupaki Desk   |   22 Jun 2021 1:30 PM GMT
జగన్ అభిమానిగా మారిపోయిన ఎంపి
X
వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు జగన్మోహన్ రెడ్డి అభిమానిగా మారిపోయారు. జగన్ను ఎలాగైనా జైలుకు పంపుతానని ఒకపుడు శపథం చేసిన రఘురామే ఇపుడు తాను జగన్ అభిమానినంటు చెప్పుకుంటున్నారు. శాసనమండలి రద్దు విషయంలో జగన్ కు ఎంపి తాజాగా ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ప్రత్యేక విలాసాలకు, విమానఖర్చులకే 2019, జూన్-2020 నవంబర్ మధ్యలో రు. 26 కోట్లు ఖర్చయినట్లు ప్రత్యర్ధులు చేస్తున్న ఆరోపణలతో తమలాంటి అభిమానులకు తీవ్రమైన మనోవేధన కలిగిస్తోందన్నారు.

మండలి రద్దును ప్రస్తావిస్తు గతంలో శాసనమండలిని రద్దు చేయాలన్న అసెంబ్లీ తీర్మానాన్ని ఎంపి జగన్ కు గుర్తుచేశారు. అప్పట్లో మండలి రద్దుకు చేసిన తీర్మానాన్ని మళ్ళీ శాసనమండలిలో కూడా చేయాలని సూచించారు. ఇపుడు మండలిలో కూడా వైసీపీకి మెజారిటి వచ్చిన నేపధ్యంలో వెంటనే రద్దు తీర్మానం చేసి ఢిల్లీకి పంపాలన్నారు. మండలి రద్దుకు పార్లమెంటు ఆమోదం అవసరమన్న విషయాన్ని కూడా ఎంపి గుర్తుచేశారు.

జగన్ ఆదేశాలను పాటించే ఎంపిగా తనతో పాటు సహచర ఎంపిలను కూడా కలుపుకుని మండలి రద్దు కోసం పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తానని చెప్పటమే విచిత్రంగా ఉంది. జగన్ కు ఎంపి రాసిన లేఖ మొత్తం ఎత్తిపొడుపులతోనే ఉందన్న విషయం తెలుసుకోలేనంత అమాయకులు ఎవరు లేరు. జగన్ అభిమానిని అని ఒకసారి, జగన్ ఆదేశాలను పాటించే ఎంపినంటు మరోసారి, జగన్ పై ప్రత్యర్ధులు చేస్తున్న ఆరోపణలతో అభిమానిగా బాధపడుతున్నట్లు మరోసారి ప్రస్తావించటంలోనే వ్యంగ్యం అర్ధమైపోతోంది.

రఘురామ ఇంతకష్టపడి లేఖలు రాస్తున్నారు కానీ వీటిని అసలు జగన్ పట్టించుకుంటారా ? డౌటే అని చెప్పచ్చు. ఇప్పటికి జగన్ కు ఎంపి చాలా లేఖలే రాశారు. ఏ లేఖ కూడా ప్రభుత్వం నుండి కానీ పార్టీ నుండి కానీ సమాధానం లేదు. జగన్ తో విభేదాలు తలెత్తినపుడు ఎంపి రాసిన లేఖలను నేతలు పట్టించుకున్నారు. ఆ తర్వాత నుండి మానేశారు. ఎంపి రాసిన లేఖలు జగన్ వ్యతిరేక మీడియా మాత్రమే కావాలని హైలైట్ చేస్తున్నాయంతే.