Begin typing your search above and press return to search.

దొంగ పోలీసుతో నా హత్యకు కుట్ర.. రఘురామ సంచలన ఆరోపణ

By:  Tupaki Desk   |   15 April 2022 11:06 AM GMT
దొంగ పోలీసుతో నా హత్యకు కుట్ర.. రఘురామ సంచలన ఆరోపణ
X
ఏపీ ప్రభుత్వంపై ఒంటికాలితో లేచే ఎంపీ రఘురామ మరోసారి సంచలన వ్యాఖ్యలతో దుమ్మెత్తిపోశారు. తన హత్యకు కుట్ర జరుగుతోందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. దొంగ పోలీసుతో తనను హత్య చేసి వేరే అకౌంట్ లో రాయాలని చూశారని అన్నారు. రామకృష్ణారెడ్డి అనే అధికారికి తన ఇంటి ముందు ఏం చేస్తున్నారని డీజీపీకి లేఖ రాసినట్లు చెప్పారు. ఇప్పటివరకూ డీజీపీ దీనిపై స్పందించలేదని ఎంపీ రఘురామ అన్నారు. విచారణ జరపాలని కేంద్రహోంశాఖ సెక్రటరీకి లేఖ రాసినట్లు రఘురామ తెలిపారు.

ఝర్ఖండ్ వ్యక్తులతో తనను చంపించేందుకు ప్రయత్నం జరుగుతోందని రఘురామ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి మారుపేరుగా మారిన సీబీసీఐడీ ఏడీజీ పీవీ సునీల్ కుమార్.. సీఎం జగన్ తో కుమ్మక్కై తనను అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్నారని ఎంపీ రఘురామరాజు ఆరోపించారు. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీకి రెండు పేజీల లేఖ రాశారు.

నా సొంత నియోజకవర్గం నరసాపురం వెళ్లాలనుకున్నప్పుడు చంపేందుకు కుట్ర పన్నారని రఘురామ ఆరోపించారు. వివిధ మత విధానాలను అనుసరిస్తున్న వారి ద్వారా ఎస్సీ కులాల మధ్య చిచ్చురేపి ఆ సందర్భంలో ఝార్ఖండ్ నుంచి తెప్పించిన గుండాల ద్వారా అల్లర్లు సృష్టించి ఆ అలజడి మధ్య నన్ను అంతమొందించేందుకు ప్రణాళిక రూపొందించారని రఘురామ ఆరోపించారు.

సునీల్ కుమార్ అసాంఘిక కార్యకలాపాల్లో మునిగి తేలుతూ రాజకీయ లబ్ధి కోసం హిందూ వ్యతిరేక భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోని అంబేద్కర్ ఇండియా మిషన్ ద్వారా నాకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో తప్పుడు కేసులు పెట్టేలా పలువురుని ప్రోత్సహించారని ఆరోపించారు. తద్వారా నన్ను కేసుల్లో ఇరికించి విచారణకు హాజరైనప్పుడు భౌతికంగా హత్య చేయాలని కుట్రపన్నారని రఘురామ లేఖలో ఆరోపించారు.

దీనిపై సాక్ష్యాలను ఇప్పటికే కేంద్రహోంశాఖకు వీడియోలతో సహా ఫిర్యాదు చేశానని రఘురామ తెలిపారు. ప్రభుత్వం నుంచి సమాచారం కోరినా రాష్ట్రం స్పందించడం లేదని అన్నారు. గత ఏడాది పోలీసులతో అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి నన్ను అంతమొందించాలని చూశారని.. ఇప్పుడు కూడా మళ్లీ ప్రాణహాని తలపెట్టినట్లు నిఘా వర్గాల ద్వారా తెలిసిందని రఘురామ లేఖలో ఫిర్యాదు చేశారు.

అరెస్ట్ చేసి కస్టడీలో ఉండగా.. గుంటూరు జైలులో తనను చంపేందుకు కుట్రపన్నారని.. సీఎం నిర్ణయాలను విమర్శిస్తున్నాననే భౌతిక దాడికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తనను చంపే కుట్రలో సజ్జల కూడా ఉన్నారన్నారు. ఈ కుట్రపై ఎన్ఐఏ వంటి సంస్థతో విచారణ జరిపించాలని ఎంపీ రఘురామ అన్నారు.