Begin typing your search above and press return to search.

ఏపీ సీఐడీ అధికారులకు రఘురామ లేఖ.. సారాంశం వింటే షాకే

By:  Tupaki Desk   |   17 Jan 2022 10:33 AM GMT
ఏపీ సీఐడీ అధికారులకు రఘురామ లేఖ.. సారాంశం వింటే షాకే
X
నిత్యం వార్తల్లో నిలిచే నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు తాజాగా ఏపీ సీఐడి అధికారులకు ఒక లేఖ రాశారు. వాస్తవానికి ఆయన ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం 3 గంటల సమయంలో గుంటూరు సీఐడీ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా పేర్కొంటూ రిజిస్టర్ అయిన కేసు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.

సంక్రాంతి పండక్కి తన సొంతూరు వెళ్లేందుకు ముందు.. హైదరాబాద్ కు వచ్చిన ఆయనకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్లారు. అక్కడే ఉండిపోయారు. తాను ఊరికి వెళ్లకపోవటానికి కారణం ఏపీ సీఐడీ అధికారులు అని పేర్కొన్న ఆయన.. తనను చంపేందుకు కుట్ర జరుగుతుందని పేర్కొని సంచలనంగా మారారు. దీంతో.. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల వేళకు సీఐడీ కార్యాలయానికి ఆయన వస్తారా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇందుకు తగ్గట్లే.. ఈ రోజు(సోమవారం) ఉదయం ఏపీ సీఐడీ అధికారులకు రఘురామ లేఖ రాశారు.

సదరు లేఖలో.. తాను చట్టాన్ని గౌరవిస్తానని.. తాను కొవిడ్ ప్రోటోకాల్ అమలు చేస్తూ విచారణకు హాజరవుతానని చెప్పిన ఆయన.. ఏపీ సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులపై చర్చించేందుకు ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. ఇప్పటికే సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులపై కోర్టును ఆశ్రయించిన రఘురామ.. తాజాగా రాసిన లేఖలో మరో కీలక అంశాన్ని ప్రస్తావించటం గమనార్హం.

హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చిన తనకు అనారోగ్యంగా ఉందని.. తాను విచారణకు హాజరయ్యేందుకు నెల రోజుల గడువు కావాలని అడిగారు. మొన్నీ మధ్యనే తాను ఫిబ్రవరి 5న తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా పేర్కొని సంచలనంగా మారారు. ఇలాంటి వేళలో ఏపీ సీఐడీ ఇచ్చిన నోటీసులకు హాజరు కాలేనన్న రఘురామ లేఖకు ఏపీ సీఐడీ అధికారులు ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారిందని చెప్పాలి.