Begin typing your search above and press return to search.

ర‌ఘురామ రాజీనామా.. ఆ ధైర్యంతోనేనా!

By:  Tupaki Desk   |   4 Jan 2022 8:43 AM GMT
ర‌ఘురామ రాజీనామా.. ఆ ధైర్యంతోనేనా!
X
గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి న‌ర‌సాపురం ఎంపీగా గెలిచి.. ఇప్పుడు ఆ పార్టీకే మేకులా త‌యారైన ర‌ఘురామ కృష్ణం రాజు త్వ‌ర‌లోనే త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇన్ని రోజులు వైసీపీ రెబ‌ల్ ఎంపీగా జ‌గ‌న్ ప్ర‌భుత్వ విధానాల‌ను విమ‌ర్శిస్తూ వ‌స్తున్న ఆయ‌న‌.. ఇక బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నార‌ని స‌మాచారం. ఆ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మైన ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నెల 7వ తేదీన ర‌ఘురామ త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌బోతున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

అందుకే ఈ నిర్ణ‌యం..
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉంది. 2024లో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌రుగుతాయి. ఆ లోపే ఏపీలో ఉప ఎన్నిక తెచ్చి జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టాల‌ని ర‌ఘురామ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. నిజానికి ఇప్పుడు త‌న ప‌ద‌వీ కాలం పూర్త‌య్యేవ‌ర‌కూ ఆయ‌న వైసీపీలోనే ఉంటూ రెబ‌ల్‌గా కొన‌సాగాల‌ని భావించారు. కానీ బ్యాంకు రుణాల ఎగ‌వేత కేసు మెడ‌కు చుట్టుకోవ‌డంతో పాటు మ‌రోవైపు అన‌ర్హ‌త వేటు కూడా పెండింగ్‌లో ఉంది. దీంతో తాను సేఫ్గా ఉండాలంటే బీజేపీలో చేరి ఉప ఎన్నిక‌కు వెళ్ల‌డ‌మే మేల‌ని ఆయ‌న భావించిన‌ట్లు స‌మాచారం.

ఆ న‌మ్మ‌కంతో..
న‌ర‌సాపురం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ బ‌లంగా ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు జ‌న‌సేన కూడా దానికి మిత్ర ప‌క్షంగా ఉండ‌డంతో ఉప ఎన్నిక‌లో త‌న గెలుపుపై ర‌ఘురామ న‌మ్మ‌కంగా ఉన్నారు. ఈ ఉప ఎన్నిక జ‌రిగితే ర‌ఘురామ‌కు మ‌ద్దతుగా టీడీపీ కూడా అభ్య‌ర్థిని నిల‌బెట్టే అవ‌కాశం ఉండ‌క‌పోవ‌చ్చు. దీంతో వైసీపీ అభ్య‌ర్థిపై ఘ‌న విజ‌యంతో ఆ పార్టీని దెబ్బ కొట్టాల‌ని ఆయ‌న చూస్తున్నారు. ఇటీవ‌ల ర‌ఘురామ‌ను అక్ర‌మంగా అరెస్టు చేయ‌డం, కొట్ట‌డం లాంటి ఘ‌ట‌న‌ల వ‌ల్ల క్ష‌త్రియ సామాజిక వ‌ర్గంలో ఆయ‌న బ‌లం పెరిగింద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. త‌న సొంత సామాజిక వ‌ర్గంలోని అగ్ర నేత‌లంద‌రూ ఆయ‌న‌తో ట‌చ్‌లోనే ఉన్నార‌ని తెలిసింది. ఆ ధైర్యంతోనే ఆయ‌న రాజీనామా చేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందు ఈ ఉప ఎన్నిక తెచ్చి జ‌గ‌న్కు స‌వాలు విసిరేందుకు రఘురామ ఉత్సాహంగా ఉన్నారు. బీజేపీ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాగానే ఆయ‌న రాజీనామా చేస్తార‌ని టాక్‌