Begin typing your search above and press return to search.

లింగంపల్లిలో రైలెక్కి బేగంపేటలో దిగిపోయిన రఘురామ!

By:  Tupaki Desk   |   4 July 2022 12:32 AM GMT
లింగంపల్లిలో రైలెక్కి బేగంపేటలో దిగిపోయిన రఘురామ!
X
సొంత నియోజకవర్గానికి వెళ్లేందుకు కిందా మీదా పడుతున్న అధికార పార్టీ ఎంపీ ఉంటారా? అంటే.. నో అంటే నో అనేస్తారు. కానీ.. సొంతపార్టీకి రెబెల్ గా మారి.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం వెళ్లటం అంత తేలికైన విషయం కాదు. ఇది మరోసారి రుజువైంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎపిసోడ్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. గడిచిన కొద్ది కాలంగా సొంత పార్టీ మీద ఆయన ఎంతలా విరుచుకుపడతారో.. అందుకు తగ్గ ఫలితాల్ని ఆ మధ్యన ఆయన రుచి చూడటం.. తనకున్న పరిచయాలు.. పలుకుబడితో సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుంచి ఢిల్లీకి వెళ్లిపోయిన ఆయన.. తాజాగా తన నియోజకవర్గానికి వెళ్లేందుకు తెగ ప్రయత్నం చేయటం తెలిసిందే.

ఈ రోజు (సోమవారం) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ స్థానం పరిధిలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న వేళ.. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన పావులు కదపటం తెలిసిందే. ఏపీలో అడుగు పెట్టినంతనే ఏదో ఒక కేసులో అరెస్టు చేస్తారన్న ఆలోచనతో సొంత రాష్ట్రానికి వెళ్లని ఆయన.. ప్రధాని మోడీ పాల్గొనే కార్యక్రమంలో స్థానిక ఎంపీ హోదాలో కచ్ఛితంగా హాజరు కావాలన్న పట్టుదలతో ఉన్నారు.

ఇందుకు తగ్గట్లే ప్రకటనలు చేయటం.. ఆయన కానీ నరసాపురంలో అడుగు పెడితే.. తిప్పలు తప్పవన్న హెచ్చరికలతో వాతావరణం వేడెక్కింది. ఎవరెన్ని చెప్పినా.. తాను మాత్రం వచ్చేది వచ్చేదన్నట్లుగా వ్యవహరించిన ఆయన.. ట్రైన్లో నరసాపురానికి బయలుదేరారు. ఈ సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. లింగంపల్లిలో నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఎక్కిన రఘురామ.. బేగంపేట రైల్వే స్టేషన్ వచ్చేసరికి రైలు దిగిపోయి.. హైదరాబాద్ లోని తన ఇంటికి వెళ్లిపోవటం ఆసక్తికరంగా మారింది.

అయితే.. తాను నరసాపురం వెళ్లటానికి చేసుకున్న ఏర్పాట్ల నేపథ్యంలో.. తనకు మద్దతు ఇచ్చే నేతలను.. అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారని చెప్పారు. తనకు అనుకూలంగా భీమవరంలో ర్యాలీ చేసిన యువకుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని వేధింపులకు గురి చేస్తున్నారని.. కొడుతున్నట్లుగా ఆరోపించారు. తాను నరసాపురానికి వెళితే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారని.. అందుకే.. తన వారి కోసం తాను తన ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా పేర్కొనటం గమనార్హం.

బేగంపేట రైల్వే స్టేషన్ లో దిగిపోయిన రఘురామ.. ఆయన బృందం ఇళ్లకు వెళ్లిపోయారు. తాను నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో భీమవరానికి బయలుదేరానని.. తాను రైల్వే స్టేషన్ కు వచ్చేసరికి తనకు కావాల్సిన వారందరిని పోలీసులు అరెస్టు చేశారన్నారు. దాదాపు యాబై మందిని అరెస్టు చేసి.. స్టేషన్ కు తీసుకొచ్చి కూర్చోబెట్టారని.. వారి తల్లిదండ్రుల్ని సైతం ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. వారంతా తనకు ఫోన్లు చేస్తున్నారని.. తాను ప్రయాణాన్ని ఆపుకుంటే మాత్రం వారిని విడిచిపెడతామని చెప్పినట్లుగా పేర్కొన్నారు.

గడిచిన రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేసిన రఘురామ.. తాను హెలికాఫ్టర్ దిగేందుకు పర్మిషన్ ఇవ్వలేదని.. అనుమతి ఇచ్చిన వారిని బెదిరింపులకు దిగి..వారిచ్చిన లేఖను వెనక్కి తీసుకునేలా చేశారన్నారు. తన పర్యటనకు కేంద్రం సహకరించినా.. రాష్ట్రం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని.. అందుకే తాను తన ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నట్లుగా చెప్పారు. ఎంత ప్రయత్నించినా.. నరసాపురానికి రఘురామను రాకుండా చేయటంలో వైసీపీ సర్కారు సక్సెస్ అవుతుందన్న మాట వినిపిస్తోంది. మరి.. దీనికి రఘురామ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.