Begin typing your search above and press return to search.

ఎంపీ గారు.. పేరు చెప్పే ధైర్యం లేదా?

By:  Tupaki Desk   |   26 Aug 2020 5:31 PM GMT
ఎంపీ గారు.. పేరు చెప్పే ధైర్యం లేదా?
X
పాత జ్యోతి లక్ష్మీ సినిమాల్లో లాగా కనిపించీ కనిపించకుండా.. చూపించి చూపించకుండా చూపించడం ఎప్పుడో అయిపోయింది.. ఇప్పుడంతా ఓపెన్.. సినిమాల్లో మొత్తం కుండబద్దలు కొట్టినట్టు చూపిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అందరూ మారారు. కానీ మన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజే మారడం లేదని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

అయ్యా.. మీరు చేసేది సంఘసేవా.. మంచి పని.. ఓ దారుణానికి కారకులు తెలిసినప్పుడు బయటపెట్ట వచ్చు కదా అని ఇప్పుడు ప్రజలంతా రఘురామకృష్ణం రాజును కోరుతున్నారు. ఇంతకీ అసలు మ్యాటరేంటంటే.. ఇటీవలే ఏపీలో ఓ వ్యక్తికి పోలీసులు శిరోముండనం చేయడం వివాదాస్పదమైంది. స్వయంగా రాష్ట్రపతి స్పందించి మరీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ శిరోముండనం కేసులో తప్పు జరిగిందని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ కూడా స్పష్టం చేశారు. అయితే ఇంతటితో ఈ వివాదం ముగిసిపోయిందనుకుంటే పొరపాటే.. ఈ శిరోముండనం వెనుక ఎవరున్నారన్నది సామాన్య ప్రజలకు ఎవరికీ తెలియదు. కానీ మన ఎంపీకి తెలుసట.. వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతీదాన్ని పుల్లబెట్టి మరీ కెలుకుతున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ రఘురామకృష్ణం రాజు ఈ విషయాన్ని కూడా తాజాగా ఢిల్లీలో ఉండి కెలికేశారట.. అదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

శిరోముండనం ఘటన వెనుకున్నది సీఎం జగన్ సమీప బంధువు అని నాకు తెలుసని రఘురామకృష్ణం రాజు తాజాగా బాంబు పేల్చారు. ‘‘ఆయనే తీవ్రంగా కొట్టమని చెప్పాడని..శిరోముండనం చేయించమని చెప్పకపోయినా జరిగిందని.. మీరు నిజ నిర్ధారణ చేయండని.. మీకు మంచి పేరు వస్తుందని సీఎం గారు..’’ అంటూ రఘురామ మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు.

శిరోముండనం వెనుకున్నది సీఎం బంధువు, కీలక వైసీపీ నేత అని ఆరోపిస్తున్న రఘురామకృష్ణం రాజు ఆ పేరు ఎవరిదో చెపితే తెలుసుకుంటాం కదా అని ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. ఏదో మీడియాలో మీ పేరు నానాలని పేరు చెప్పకుండా మీ మైలేజ్ పెంచుకునే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదేమో.. ఒక్కసారి ఆలోచన చేయండని ప్రజలు హితవు పలుకుతున్నారు. మీకు పేరు తెలిసి చెప్పకపోవడం అన్యాయమని.. దీన్ని బట్టి ఆ క్రిమనల్ కేసులో మీరు సాక్షి అవుతారేమోనని కూడా అందరూ అనుకుంటున్నారు.