Begin typing your search above and press return to search.

రాజుగారు ఉపఎన్నికలకు వెళ్ళచ్చు కదా?

By:  Tupaki Desk   |   25 Aug 2022 7:32 AM GMT
రాజుగారు ఉపఎన్నికలకు వెళ్ళచ్చు కదా?
X
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి మహా వస్తే 10 నుండి 15 అసెంబ్లీ సీట్లు వస్తే ఎక్కువని వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు. సొంతంగా పోటీ చేస్తే టీడీపీ గెలుపు ఖాయమన్నారు. అదే టీడీపీ, జనసేన పొత్తుపెట్టుకుంటే రాష్ట్రం మొత్తాన్ని స్వీప్ చేసేయటం ఖాయమని బల్లగుద్ది మరీ చెప్పారు. టీడీపీ గెలవబోయే నియోజకవర్గాల్లో కొన్నింటిని చదివి మరీ వినిపించారు. ప్రత్యేక యాప్ ద్వారా ఎంపీ చేయించిన సర్వేలో వచ్చిన ఫలితాలు జెనూయిన్ జెనూయిన్ అంటు పది సార్లు చెప్పారు.

అంతాబాగానే ఉంది తాను చేయించిన సర్వే అంత జెనూయిన్ అయితే వెంటనే తాను ఎంపీగా రాజీనామా చేసేయచ్చుకదా అని వైసీపీ నుండి సెటైర్లు పేలుతున్నాయి. తాను వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేసి టీడీపీ లేదా జనసేన తరపున పోటీ చేసి గెలవచ్చుకదా అని వైసీపీ నేతలు సవాళ్ళు చేస్తున్నారు.

తాను చేయించుకున్న సర్వేలో నరసాపురం ఎంఎల్ఏ సీటులో టీడీపీకే గెలుపు అవకాశాలున్నట్లు చెప్పారు. పైగా ఎంపీ అంచనా ప్రకారం టీడీపీ, జనసేనకు 160 సీట్లు ఖాయమని తేలింది.

160 అసెంబ్లీ సీట్లలో టీడీపీ, జనసేన గెలుపు ఖాయమన్న తర్వాత ఎంపీ సీట్లలో మొత్తం 25కి 25 ఈ పార్టీలే గెలుచుకునే అవకాశాలున్నాయి. అంటే ప్రతిపక్షాలు గెలుచుకోవటం ఖాయమన్న ఎంపీ సీట్లలో నరసాపురం కూడా ఉందనే కదా అర్ధం.

గెలుపు అంత స్పష్టంగా తెలుస్తున్నపుడు ఎంపీగా రాజీనామా చేయటానికి ఎందుకు రఘురాజు వెనకాడుతున్నారు ? రాజీనామా చేసి ఉప ఎన్నిక తెప్పించి మళ్ళీ గెలిస్తే తిరుగుబాటు ఎంపీ సర్వే నిజమే అని జనాలు నమ్మే అవకాశం ఉంది.

శాంపుల్ రిజల్టు కోసమైనా తాను రాజీనామా చేస్తే బాగుంటుంది కదా. వెంటనే ఎంపీగా రాజీనామా చేసి ప్రతిపక్షాల్లో జోష్ తీసుకొచ్చేందుకు రఘురాజు నడుంబిగించాలి. దెబ్బకు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఏమిటో ఉప ఎన్నికతోనే తేలిపోతుంది. భవిష్యత్ ఫలితాలకు రాజుగారి రాజీనామాయే మార్గం చూపితే బాగుంటుంది.