Begin typing your search above and press return to search.

లాలూకు దెబ్బ మీద దెబ్బ.. తాజా దెబ్బతో మరింత డీలా

By:  Tupaki Desk   |   10 Sep 2020 5:35 PM GMT
లాలూకు దెబ్బ మీద దెబ్బ.. తాజా దెబ్బతో మరింత డీలా
X
లాలూ ప్రసాద్ యాదవ్.. భారత రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ చీఫ్ గా, బీహార్ ముఖ్యమంత్రిగా చాలాకాలం పనిచేసిన ఆయన కేంద్ర కేబినెట్ లో రైల్వే శాఖ మంత్రిగా తనదైన శైలిలో సత్తా చాటి ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ స్కూళ్లకు స్ఫూర్తిగా నిలిచారు. అయితే ఇదంతా గతం. గత కొంతకాలంగా లాలూకు ఏదీ కలిసి రావడం లేదు. దాణా స్కాంలో తాను అరెస్ట్ కాగా... బీహార్ డిప్యూటీ సీఎంగా కుదురుకుంటాడనుకున్న ఆయన తనయుడు తేజస్వీ యాదవ్.. నితీశ్ కుమార్ తో పొసగలేక బయటకు వచ్చేయక తప్పలేదు. తాజాగా లాలూకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. బీహార్ అసెంబ్లీకి జరగనున్న కీలక ఎన్నికల ముంగిట లాలూ పార్టీకి పార్టీ కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ రాజీనామా చేశారు.

ప్రస్తుతం బీహార్ లో నెలకొన్న పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకునేందుకు సన్నాహాలు మొదలెట్టిన లాలూ... తన వారసులకు వ్యూహాలు నేర్పుతున్నారు. నితీశ్ పై పెరిగిన ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకుని తన కుమారుడు తేజస్వీని బీహార్ సీఎం కుర్చీలో కూర్చోబెట్టేలా లాలూ పథకాలు రచిస్తున్నారు. అయితే అనూహ్యంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించిన రఘువంశ్... లాలూకు భారీ షాకే ఇచ్చారు. అసలే ఎన్నికలు, ఆపై పార్టీలో తన స్థాయి సీనియారిటీ కలిగిన నేతగా గుర్తింపు పొందిన రఘువంశ్ రాజీనామాను లాలూ ఎలా జీర్ణించుకుంటారో చూడాలి.

సుధీర్ఘ కాలం పాటు ఆర్జేడీలో కొనసాగిన రఘువంశ్... లాలూ జైలుపాలు కాకముందు యాక్టివ్ గా ఉన్నారు. లాలూ జైలుకెళ్లాక, ఆర్జేడీకి కష్టాలు మొదలయ్యాక కూడా రఘువంశ్ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. పార్టీలో యువతకు ధైర్యం నూరిపోస్తూ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. అయితే లాలూతో కుదిరినట్టుగా లాలూ కుమారుడు తేజస్వీతో రఘువంశ్ కు అంతగా కుదరలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కీలక ఎన్నికలకు రెండు నెలల సమయం ఉందనగా రఘువంశ్ పార్టీకి రాజీనామా చేసేశారు. త్వరలోనే ఆయన ఎన్డీఏ కూటమిలో చేరతారన్న వాదనలు వినిపిస్తున్నాయి.