Begin typing your search above and press return to search.

నోటుపై సంతకం రచ్చను తెర పైకి తెచ్చేశాడు

By:  Tupaki Desk   |   27 Nov 2016 2:59 PM GMT
నోటుపై సంతకం రచ్చను తెర పైకి తెచ్చేశాడు
X
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో చాలామంది నాయకులు మాట్లాడారు కానీ.. ఏపీ కాంగ్రెస్ రథసారధి రఘువీరారెడ్డి తెచ్చిన పాయింట్ సరికొత్తగా ఉంది. ఆయన చేస్తున్న పాయింట్ ను కానీ నేషనల్ మీడియా లుక్ వేస్తే ప్రధాని మోడీకి చిక్కులు తప్పవన్నట్లుగా ఉంది. ఇంతకీ రఘువీరా చెప్పిన పాయింట్ లో అంత విషయం ఏముందంటారా? అక్కడికే వస్తున్నాం. పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిన వ్యవహారాన్ని రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదని.. దానికి గత కొన్ని నెలలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీ పరివారం చెప్పటం తెలిసిందే. రద్దు ప్రక్రియలో భాగంగా రూ.2వేల నోటును ఆరు నెలల కిందటే ముద్రిస్తున్నట్లుగా ఆర్థిక కార్యదర్శి చెబుతున్నారని.. మరి ఆయన మాట ప్రకారం ఆరు నెలల క్రితమే నోట్లను ముద్రిస్తుంటే.. నోటు మీద నాటి రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ సంతకం ఉండాలి కదా?అన్నది రఘువీరా ధర్మ సందేహం.

తాను చెబుతున్న అంశం మీద దర్యాప్తు చేయాలని రఘువీరా వాదిస్తున్నారు. రూవెయ్యి.. రూ.500 నోట్లరద్దు వెనుక అతి పెద్ద కుంభకోణం వుందన్న ఆయన నరేంద్రమోడీని అందరూ పిలిచే ‘నమో’కు రఘువీరా కొత్త అర్థాన్ని చెప్పుకొచ్చారు. నమో అంటే నరేంద్ర మోడీ ఎంతమాత్రం కాదని.. నమ్మించి మోసం చేయటంగా అభివర్ణించారు. నోట్ల రద్దు కారణంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పోగొట్టుకుంటున్నట్లుగా ఆయన మండిపడుతున్నారు.

ప్రధానికి సంబంధించిన వారి నల్ల డబ్బును తెల్లడబ్బుగా మార్చుకునేందుకు పెద్దనోట్లను రద్దు చేసినట్లుగా ఆయన ఆరోపించారు. మోడీని దైవదూతగా అభివర్ణించే వెంకయ్యపై ఫైర్ అయిన రఘువీరా.. మోడీకి సంబంధించి మరో ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. పార్లమెంటుకు గౌరవం ఇవ్వని మోడీ.. మైకు దొరికితే మాత్రం ఉదరగొట్టేస్తున్నారని చెప్పారు. జాతీయ రాజకీయాల గురించి మాట్లాడిన రఘువీరా ఏపీ విషయాన్ని చివర్లో కాసింత చెప్పుకొచ్చారు. ఏపీకి చేసిన సాయంపై అమిత్ షా సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నారని.. విభజన చట్టాన్ని తూట్లు పొడుస్తున్నట్లుగా మండి పడ్డారు. రూ.2వేల నోటు మీద సంతకం విషయంలో రఘువీరా పాయింట్ కు కమలనాథులు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.