Begin typing your search above and press return to search.

రఘువీరా లౌక్యం : మసిగుడ్డ కాల్చి పారేస్తే సరి!

By:  Tupaki Desk   |   12 Sep 2017 4:27 AM GMT
రఘువీరా లౌక్యం : మసిగుడ్డ కాల్చి పారేస్తే సరి!
X
ఏపీలో ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు ఎందుకు అవగాహన కలగడం లేదు. ప్రభుత్వాన్ని ఎండగట్టే పనులు ఎందుకు జరగడం లేదు. ఎందుకంటే.. ప్రధానంగా ఈ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకపోవడం ఒక కారణం అని చెప్పుకోవాల్సి వస్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక్కరే.. సర్కారు వైఫల్యాల మీద పోరాడే వ్యక్తిగా తయారయ్యారు. సామాజిక ఉద్యమకారులుగా తమను తాము చెప్పుకునే పలువురు... అవకాశ వాదంతో వ్యవహరించేవారే. తతిమ్మా రాజకీయ పార్టీల్లో కాంగ్రెస్.. ఎటూ తమకు ఈ రాష్ట్రంలో భవిష్యత్తు ఉండబోదనే క్లారిటీ చాలా డొంకతిరుగుడుగా, సమస్యల గురించి పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తోంది. అందుకే ప్రభుత్వం చెలరేగిపోతున్నదని ప్రజలు అనుకుంటున్నారు.

ఏపీలో పూర్తిగా శిథిలం అయిపోయిన కాంగ్రెస్ పార్టీ ఏదో మాటలు చెప్పి బాధ్యతలనుంచి తప్పించుకోవడం మినహా.. ఆశలు వదిలేసుకున్నట్లే అని తాజా మాటలను గమనిస్తే అర్థం అవుతుంది. కడపలో ఉక్కు పరిశ్రమ సాధించడం గురించి ఓ సభ జరిగింది. రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు విపక్షాలకు చెందిన అందరు నాయకులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రఘువీరా.. కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపిస్తాం అంటూ.. కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలోనే చెప్పేసిందని.. కానీ ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని.. నింద వాళ్ల మీద వేసేశారు. అయితే దీన్ని సాధించడానికి తామేం చేస్తామో చెప్పకుండానే... విశాఖ ఉక్కు కోసం జరిగిన పోరాటం తరహాలోనే.. ‘కడప ఉక్కు ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో సాధించుకోవాలని ఆయన పిలుపు ఇచ్చారు. అయితే.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం కడప ఉక్కు పరిశ్రమ సాధనకు అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలంటూ ఆయన సందేశం ఇచ్చారు.

అక్కడే ఆయన లౌక్యం ప్రదర్శించారని అంతా అనుకుంటున్నారు. వాస్తవంగా ఈ కడప ఉక్కు పరిశ్రమకోసం తాము కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలాంటి పోరాటం సాగిస్తామో చెప్పకుండానే... బంతిని చంద్రబాబు కోర్టులో పారేశారని అంతా అనుకుంటున్నారు. ఇంతకంటె ధర్మసమ్మతమైన అనేక అంశాల విషయంలోనే అఖిలపక్షం అభిప్రాయాలు తీసుకోవడం అనే దిశగా చంద్రబాబు ఎన్నడూ పట్టించుకున్న దాఖలాలు లేవు. అలాంటిది.. కేంద్రం ద్వారా ఒక పట్టాన సాధించే అవకాశం లేని కడప ఉక్కు పరిశ్రమ కోసం.. కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంబించేలా అఖిలపక్షం తీసుకువెళ్తారనుకోవడం భ్రమ. ఇలా చంద్రబాబు - అఖిలపక్షం మీద నెపం వేసేయకుండా.. హామీ ఇచ్చిన తమ పార్టీ జాతీయ నాయకత్వంతో కలిసి, రాహుల్ సారథ్యంలో కడప ఉక్కు పరిశ్రమ కోసం పోరాటం చేస్తామని రఘువీరా చెప్పి ఉంటే వారి పార్టీకి చాలా గౌరవంగా ఉండేదని ప్రజలు అనుకుంటున్నారు.