Begin typing your search above and press return to search.

రఘువీరా సవాళ్లు విసురుతున్నారే...

By:  Tupaki Desk   |   9 April 2015 5:33 PM IST
రఘువీరా సవాళ్లు విసురుతున్నారే...
X
ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి ఈ మధ్య విపరీతమైన దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడం కోసం ప్రారంభం అయిన రఘువీరా దూకుడు తెలంగాణలోకి వస్తున్న ఏపీ వాహనాలపై ఎంట్రీ ట్యాక్స్‌ విధించడం విషయంలో గవర్నర్‌ను కలవడం, కరువుపై నివేదికలు ఇవ్వలేదని చంద్రబాబును విమర్శించడం, బాబు కొడుకు లోకేష్‌ అవినీతి అంటూ వరుసగా విరుచుక పడటం వరకు తీసుకువచ్చిన రఘువీరా తాజాగా మరోధైర్యం చేశారు.



ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి దమ్ముంటే కాంగ్రెస్‌ పార్టీ పాలనపై విచారణ చేసుకోవచ్చని సవాలు విసిరారు. కాంగ్రెస్‌ గొంతు నొక్కే సత్తా ఎవరికీ లేదని, తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయ లేదని ప్రజలు ప్రస్తుతం బాధ పడుతున్నారని రఘువీరారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల హక్కు అని ఆయన తెలిపారు. చట్టం ద్వారా ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని, కేబినెట్‌ నిర్ణయంతోనే ప్రత్యేకహోదా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. దద్దమ్మలు కాబట్టే బీజేపీ నేతలు డొంక తిరుగుడుగా మాట్లాడున్నారని విమర్శించారు.



పనిలో పనిగా ఆయన పార్లమెంటు వ్యవస్థపైనా తన అభిప్రాయాలను వెల్లడించారు. చట్ట సభల్లో కార్పొరేట్‌ హవా పెరిగిపోయిందన్న ఆయన ధనవంతులు, పారిశ్రామికవేత్తలకే సీట్లు ఇస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం విద్యార్థులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. వర్సిటీలు, కాలేజీల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని రఘువీరా పిలుపునిచ్చారు. ఈ నెలాఖరులోపు అనుబంధ కమిటీల నియామకాలు పూర్తి చేస్తామని రఘువీరారెడ్డి వివరించారు.



ఇంత ధైర్యంగా మాట్లాడుతున్న రఘువీరా..అససలు విషయాలు మర్చిపోయారేమోననే భావన వినిపిస్తోంది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకున్న వ్యక్తి సంపాదనే వేల కోట్లు రూపాయలను ఈడీ అటాచ్‌ చేస్తుంటే.. కాంగ్రెస్‌ నేతలు జలయజ్ఞం వంటివాటిల్లో ఎంత సంపాదించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. రఘువీరా నిర్వహించిన వ్యవసాయ శాఖలోనే మేఘమథనం పేరుతో కోట్లాది రూపాయల అన్యాక్రాంతం అయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి.



ఇంత డేర్‌గా తమ పాలనపై కాంగ్రెస్‌ నేతలు సవాలు విసురుతున్ననేపథ్యంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.