చంద్రబాబు బానిస అయిపోయారా?
By: Tupaki Desk | 23 April 2015 9:52 AM ISTఅవకాశం దొరికితే చాలు విమర్శలు చేద్దాం అన్నట్లు ఉంటుంది కొందరు నాయకుల వైఖరి. పైగా వివిధ కారణాల వల్ల కొద్దోగొప్పో చిక్కుల్లో పడిన వారిపై ఈ దాడి మరింత ఎక్కువ ఉంటుంది. తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఇపుడు ఇదే పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, ఇతరత్రా ప్రయోజనాల విషయంలో మిత్రబంధం, మరికొద్ది కాలం వేచిచూద్దాం అన్నట్లు కేంద్రంలోని సర్కారుపై దూకుడుగా వ్యవహరించకపోవడాన్ని ప్రతిపక్షాలు అవకాశంగా తీసుకుంటున్నాయి. ఈ విషయంలో తాజాగా ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఒకడుగు ముందుకువేసి విమర్శలు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీకి బానిసత్వం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలో బీజేపీ, రాష్ర్టంలో టీడీపీ కలిసి నాటకం ఆడుతున్నాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీలపై రాష్ర్టంలోని అన్ని పార్టీలు యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉందననారు. ప్రత్యేక హోదా సాధనకోసం అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలని కోరినా వారి నుంచి స్పందన లేదని, భవిష్యత్తులో ఇక అడగబోమని తేల్చిచెప్పారు. అయితే ప్రత్యేకహోదా కోసం ఉద్యమం చేస్తామన్నారు. తమ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇప్పటికే ఈ విషయమై పార్లమెంట్ లో మాట్లాడారని, మన్మోహన్్ సింగ్్ కూడా మాట్లాడే అవకాశం ఉందన్నారు.
పనిలోపనిగా రఘువీరా తమ పార్టీకి కూడా కితాబు ఇచ్చుకున్నారు. 2013లో రూపొందించి భూసేకరణ చట్టానికి టీడీపీ, బీజేపీలు మద్దతిచ్చాయాని, మాటమార్చి ఇప్పుడురైతులకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. ఒకవైపు రాజధానిలో రైతుల నుంచి భూములు లాక్కుంటూ మరోవైపు ఈషా ఫౌండేషన్్ వంటి సంస్థలకు వందల ఎకరాలు కేటాయించడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. పోలవరం నిర్మాణం విషయంలోనూ ప్రజలు బీజేపీ చిత్తశుద్ధిని అర్థం చేసుకున్నారని రఘువీరా అన్నారు.
పీసీసీ అధ్యక్ష బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు కంకణం కట్టుకున్నరఘువీరా ఆ రీతిలో దూకుడుగానే వెళుతున్నారు.