Begin typing your search above and press return to search.

భిక్షం నిజ‌మే.. మీరు చేసిందేంటి ర‌ఘువీరా?

By:  Tupaki Desk   |   19 Feb 2016 5:08 AM GMT
భిక్షం నిజ‌మే.. మీరు చేసిందేంటి ర‌ఘువీరా?
X
ర‌ఘువీరాకు కోపం వ‌చ్చింది. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో మోడీ స‌ర్కారు అనుస‌రిస్తున్న వైఖ‌రిపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అదే స‌మ‌యంలో.. బాబు స‌ర్కారు కొలువుదీరి రెండేళ్ల‌కు ద‌గ్గ‌ర ప‌డుతున్నా.. శంకుస్థాప‌న‌ల మీద శంకుస్థాప‌న‌లు చేయ‌ట‌మే కానీ నిర్మాణాలు మొద‌లే కానీ తీరుపై ఆయ‌న మండిప‌డుతున్నారు. అమ‌రావ‌తిలో శాశ్విత నిర్మాణాలు క‌ట్ట‌కుండా.. తాత్కాలిక నిర్మాణాలు క‌ట్ట‌టం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

ఏపీ రాజ‌ధాని నిర్మాణానికి రూ.40వేల కోట్లు అవ‌స‌ర‌మైతే.. చంద్ర‌బాబు రూ.1500కోట్లు అడిగార‌ని.. కేంద్రం రూ.200 కోట్లు భిక్షం వేసింద‌ని చిరాకు ప‌డిపోయారు. రాష్ట్ర విభ‌జ‌న ప్ర‌క్రియ మొద‌లైన నాటి నుంచి ఏపీకి వ‌రుస‌గా అన్యాయాలే జ‌రుగుతున్నాయే కానీ.. న్యాయం జ‌రిగింది లేదు. దీనంత‌టికి కార‌ణమైన కాంగ్రెస్ పార్టీ. విభ‌జ‌న ప్ర‌క్రియలో ఏ ఒక్క చోట స‌రిగా వ్య‌వ‌హ‌రించింది లేదు. విభ‌జ‌న త‌ర్వాత ఏపీకి క‌లిగే న‌ష్టం గురించి కాంగ్రెస్ కు తెలిసినా.. దాని నివార‌ణకు సంబంధించి ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోలేదు.

ఏపీకి జ‌రిగే విభ‌జ‌న న‌ష్టాన్ని క‌నిష్ఠ స్థాయికి ప‌రిమితం చేసేందుకు వీలుగా విభ‌జ‌న చ‌ట్టంలో ఎలాంటి ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. అయితే.. ఇలాంటి వేటినీ నాడు ర‌ఘువీరా అండ్ కో ప‌ట్టించుకున్న‌ది లేదు. ఇప్పుడు తెగ ఆవేశ‌ప‌డిపోతున్న ఆయ‌న.. విభ‌జ‌న స‌మ‌యంలోనే సోనియాను గ‌ల్లా ప‌ట్టుకొని అడిగి ఉంటే.. ఈ రోజు మాట్లాడే వీలుండేది.

అలాంటిదేమీ లేకుండా అప్పుడు నోరు మూసుకొని ఉన్న ర‌ఘువీరా ఇప్పుడు మాత్రం ఏదో జ‌రిగిపోయింద‌ని వాపోవ‌టంలో అర్థం లేదు. విభ‌జ‌న సంద‌ర్భంగా ఏపీకి ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు వీలైనంత జాగ్ర‌త్త‌లు తీసుకొని ఉండి ఉంటే.. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితే ఉండేది కాదన్న విష‌యం మ‌ర్చిపోకూడ‌దు. విభ‌జ‌న చ‌ట్టంలో ఏపీ ప్ర‌యోజ‌నాల‌కు త‌గిన ర‌క్ష‌ణ క‌ల్పించ‌కుండా పెద్ద త‌ప్పు చేసిన కాంగ్రెస్ కార‌ణంగా.. ఈ రోజు కేంద్రాన్ని అడుక్కునే ప‌రిస్థితి. చేయాల్సిందంతా చేసేసి.. ఈ రోజు చంద్ర‌బాబు ఏదో చేసిన‌ట్లుగా చెబుతున్న ర‌ఘువీరా.. ముందు తాము చేసిన త‌ప్పుల‌కు గ‌ట్టిగా చెంప‌లు వేసుకోవ‌ట‌మే కాదు.. ఏపీకి ఏమీ చేయ‌టం లేద‌ని ప్ర‌ధాని మోడీని సోనియా అండ్ కో అడిగేలా ఎందుకు ఒత్తిడి చేయ‌టం లేదు. ర‌ఘువీరా అండ్ కో ముందు అలాంటి ప‌ని చేస్తే బాగుంటుంది.