Begin typing your search above and press return to search.

వాళ్లు కూడా ఖాళీ కంచాలు మోగిస్తార‌ట‌!

By:  Tupaki Desk   |   7 Jan 2017 5:09 AM GMT
వాళ్లు కూడా ఖాళీ కంచాలు మోగిస్తార‌ట‌!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో త‌న ఉనికి చాటుకునేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్న కాంగ్రెస్ పార్టీ తాజా స‌మావేశంలో భ‌విష్య‌త్‌ లో ఏ విధంగా ముందుకు వెళ్లాల‌నే విష‌య‌మై తీవ్రంగా మ‌ధించి కార్యాచ‌ర‌ణ సిద్ధం చేసింది. పెద్ద నోట్ల రద్దు - ప్రజలు నోట్లపాట్లతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ నీటి ప్రాజెక్టులపై చంద్రబాబు చేస్తున్న అబద్దపు ప్రచారంతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పాల్గొనున్న విషయాలపై పెద్ద ఎత్తున ప్ర‌చారం చేయాల‌ని, నిర‌స‌న‌లు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. విజ‌య‌వాడ‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దక్షిణ భారత కో అర్డినేటర్ డీకే శివకుమార్ సార‌థ్యంలో జ‌రిగిన స‌మావేశం వివ‌రాల‌ను ఏపీపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి వివ‌రించారు.

నోట్ల రద్దు వెనుక దాగిన అవినీతి - రద్దు ప్రకటనకు ముందు కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం కల్పించిన కేంద్ర పాలకుల లీకుల తీరును ప్ర‌జ‌ల‌కు చేర‌వేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ర‌ఘువీరా తెలిపారు. నోట్లరద్దుతో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలలో మోడీ - బాబులు సమాన బాధ్యులేనన్న విషయాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించిందని ర‌ఘువీరా రెడ్డి తెల‌పారు. నోట్ల పాట్ల బాధితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిన జాతీయ స్థాయి ఉద్యమంలో భాగంగా ఈనెల 7 వ తేదీలలో 13 జిల్లాల కలెక్టరేట్ల ముట్టడి - 9న ఖాళీ ప్లేట్లతో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్టు తెలిపారు. రద్దు విషయాన్ని సీఎం చంద్రబాబు - ప్ర‌తిప‌క్ష‌నేత‌ జగన్ తో పాటు తమకు కావాల్సిన కార్పొరేట్ వ్యక్తులు - సంస్థలకు ముందుగానే లీకులిచ్చి నల్లధన కుబేరులను ఆదుకొన్న పాలకులు సామాన్యుల జీవితాలను మాత్రం వీధుల పాలు చేసిన అప్రజాస్వామ్య విధానాలే కాంగ్రెస్ పార్టీ ప్రచార ఆయుధాలని ర‌ఘువీరా రెడ్డి అన్నారు. నోట్లరద్దు వెనుక దాగిన కుట్ర - అవినీతి కుంభకోణాలన్నీ బహిర్గతం చేసి దోషులకు శిక్షపడే వరకూ కాంగ్రెస్ ఉద్యమం కొనసాగుతుందన్నారు. నోటుకోసం ఎటిఎం - బ్యాంకుల వద్ద క్యూలైన్లలో మృతి చెందిన వారందరికీ 25లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు.

రాబోయే శాసన మండలి - కార్పొరేషన్ ఎన్నికలపై ఎపిసిసి చేపట్టాల్సిన కార్యాచరణ - అభ్యర్థుల ఎంపిక పై నియమావళిని ప్రకటించిన రఘువీరారెడ్డి 13 జిల్లాల అసెంబ్లీ నియోజకవర్గల సమీక్షపై కార్యవర్గంలో విస్తృతంగా చర్చించిన అనంతరం కమిటీలను ప్రకటించారని తెలిపారు. పోలవరం - ఇతర సాగునీటి ప్రాజెక్టులపై జరుగుతున్న అవినీతి, చంద్రబాబు చేస్తున్న అబద్ధాల ప్రచారాలను తిప్పికొట్టి నిజా నిజాలను ప్రజలకు తెలియపర్చి పార్టీకి పూర్వవైభవం తీసుకురావడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ర‌ఘువీరారెడ్డి పిలుపునిచ్చారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/