Begin typing your search above and press return to search.

బాబు ఇలా బానిస అయిపోయాడేంటి?

By:  Tupaki Desk   |   24 Dec 2016 11:05 AM IST
బాబు ఇలా బానిస అయిపోయాడేంటి?
X
ఇటీవ‌లి కాలంలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌డం ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి తాజాగా మ‌రో సంచ‌ల‌న కామెంట్ ను చంద్ర‌బాబుపై వ‌దిలారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ప్రశ్నిద్దాం రండి పేరుతో చలో వెలగపూడి కార్యక్రమం నిర్వహించిన సంద‌ర్భంగా తుళ్లూరులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో రఘువీరా మాట్లాడారు. బ‌డా పారిశ్రామిక‌వేత్త‌లైన అంబానీ - అదాని చేతుల్లో ప్రధాని నరేంద్రమోడీ బానిసగా ఉంటే, ఆయన చేతుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బానిసగా మారారని విమర్శించారు. నేతి బీర‌లో నేయి ఉండ‌ద‌నే రీతిలో చంద్రబాబు పేరుపెట్టిన ప్ర‌జా రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప్ర‌జ‌ల‌కు చోటు లేద‌ని వ్యాఖ్యానించారు. వెలగపూడి సచివాలయం ప్రజల కోసం కాదని, బాబును కలిసేందుకు సూటు - బూటు ధరించి వచ్చే మలేసియా - సింగపూర్‌ - జపాన్‌ ప్రతినిధుల కోసం నిర్మించారని ర‌ఘువీరా వ్యాఖ్యానించారు.

పెద్ద నోట్ల రద్దు కారణంగా దాదాపు 150 మంది చనిపోయినా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టుకూడా లేదని ర‌ఘువీరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే తాము భావిస్తున్నామని, మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి అన్ని రంగాల్లోనూ అవినీతి ఎక్కువైందని, నోట్ల రద్దు సీఎంకు ముందుగా తెలియకపోతే రూ.200 కోట్లు విలువచేసే హెరిటేజ్‌ కంపెనీని రూ.2వేల కోట్లకు ఎందుకు అమ్మేశారని ప్రశ్నించారు. నల్లధనాన్ని నియంత్రించేందుకే పెద్దనోట్లను రద్దు చేశామని చెబుతున్న ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఎంతమంది దగ్గర నల్లధనాన్ని వెలికితీశాయో చెప్పాలని రఘువీరా డిమాండ్‌ చేశారు. 90శాతం ఉన్న ప్రభుత్వ బ్యాంకులకు 56 శాతం నగదు - పదిశాతమే ఉన్న ప్రైవేటు బ్యాంకులకు 44 శాతం నగదు ఇవ్వడంతో వేలకోట్ల నల్లధనం ప్రైవేటు బ్యాంకుల్లో చేరిందని ర‌ఘువీరా వివ‌రించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 2019లో దేశానికి రాహుల్‌ గాంధీ ప్రధానికావడం తథ్యమని ర‌ఘువీరారెడ్డి జోస్యం చెప్పారు. అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్‌ కు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తుందని రఘువీరారెడ్డి చెప్పారు. అందుకే రాష్ట్రంలో ప్రజాబ్యాలెట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వచ్చే రెండు నెలల్లో ఈ ప్రజాబ్యాలెట్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ప్రత్యేక హోదాపై ప్రజాబ్యాలెట్ ద్వారా రాష్ట్రంలో 5 కోట్ల ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం 13 రాజకీయ పార్టీల మద్దతు కోరుతున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ నుండి నాయకులు బయటకు వెళ్ళిపోయినా కార్యకర్తలు స్థిరంగానే ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్‌ ఛార్జ్‌ లు లేనిచోట కొత్తవారిని నియమిస్తామని చెప్పారు.

ఎఐసిసి కార్యదర్శి కుంతియా మాట్లాడుతూ దేశంలో సగంమంది నిరక్ష్యరాస్యులున్నారని వారంతా నగదురహిత లావాదేవీలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఎంపీ కేవీపీ.రామచంద్రరావు మాట్లాడుతూ సామాన్యుల కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ప్రధాని ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/