Begin typing your search above and press return to search.

చావులు ఆగాలంటే వియ్యంకులపై వేటే!!

By:  Tupaki Desk   |   30 Oct 2017 4:30 AM GMT
చావులు ఆగాలంటే వియ్యంకులపై వేటే!!
X
కార్పొరేట్ జూనియర్ కాలేజీలు పిల్లల పట్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఒత్తిడి పెంచుతూ వారిని కబళించేస్తూ ఉండడం కొత్త విషయం కాదు. ఈ విషయంలో తెలుగునేలపై, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లోని కళాశాలల యాజమాన్యాలు మాస్టర్ డిగ్రీ సంపాదించాయనే చెప్పాలి. దేశవ్యాప్త పోటీ పరీక్షల్లో కూడా ర్యాంకులు కొట్టేలా పిల్లలను కోచింగ్ పేరుతో పిండేయడం మాత్రమే కాదు, దేశంలో ఉత్తరాది రాష్ట్రాలకు కూడా విస్తరిస్తున్న వీరి విద్యాసంస్థల నెట్ వర్క్ ను చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతగా ర్యాంకులకు, అంతకంటె ఎక్కువగా విద్యార్థుల ఆత్మహత్యలకు ఐకాన్లలాగా తెలుగునేలమీది జూనియర్ కళాశాలలు నడుపుతున్న యాజమాన్యాలు మారాయి అనడం అతిశయోక్తి కాదు.

అయితే ఇటీవలి కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు వరుసగా జరుగుతుండడం చాలా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా పరీక్షల సీజన్ మొదలైన తర్వాత.. ఇంకా పిల్లల మీద ఎంత ఒత్తిడిపెంచుతారో, మరెన్ని చావులను చూడాల్సి వస్తుందో అనే భయాలు ప్రజల్లో ఉంటున్నాయి. ప్రభుత్వం మొక్కుబడి చర్యలతో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో.. సామాజిక ఉద్యమకారులు, -మేధావులు - ప్రతిపక్షాలు కూడా ఈ విషయంలో గొంతెత్తి నినదిస్తున్నాయి. బెజవాడలోనూ ఎడిటర్ల ఆధ్వర్యంలో రామన్ మెగసెసే అవార్డు గ్రహీత సందీప్ పాండే అతిథిగా ఓ సదస్సు జరిగింది. కార్పొరేట్ కాలేజీలు - కోచింగుల్ని నిషేధిస్తే తప్ప.. ఈ ఆత్మహత్యలు ఆగే అవకాశం లేదని పాండే అన్నారు.

అయితే ఇదే కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వంలోని మంత్రులు- వియ్యంకులు గంటా శ్రీనినవాసరావు, నారాయణలపై వేటు వేస్తే తెలుగునేలపై పిల్లల చావులను అరికట్టడానికి సరైన చట్టాలు రూపొందే అవకాశమే లేదని అంటున్నారు. ఒకవైపు మంత్రి నారాయణ విద్యార్థులను పొట్టన పెట్టుకుంటున్న నారాయణ విద్యాసంస్థలకు అధిపతి అయితే.. సంస్థల మీద ఎలాంటి చర్య తీసుకోని అచేతనమైన విద్యాశాఖ మంత్రిగా గంటా శ్రీనివాసరావు ఉంటున్నారు. వీరిద్దరూ ఈ పదవుల్లో ఉన్నంత వరకూ విద్యాసంస్థల నియంత్రణపై సరైన చట్టాలు రావని, పిల్లల చావులు ఆగవని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మరి పోలవరం, అమరావతి తప్ప మరో మాట మాట్లాడే అలవాటు లేని చంద్రబాబునాయుడు కు ఈ పిల్లల తల్లిదండ్రుల శోకాలు వినిపిస్తాయో లేదో?