Begin typing your search above and press return to search.

తుస్సుమనే ఉద్యమాలతో ఏం సాధిస్తారు సారూ!

By:  Tupaki Desk   |   7 Nov 2015 3:52 AM GMT
తుస్సుమనే ఉద్యమాలతో ఏం సాధిస్తారు సారూ!
X
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఎంత కన్ఫ్యూజన్‌ లో కొట్టుమిట్టాడుతున్నదనడానికి ఆ పార్టీ నిర్వహించదలచుకుంటున్న ఉద్యమాలే పెద్ద ఉదాహరణ. ప్రత్యేక హోదా సాధించడం కోసం మడమ తిప్పని పోరాటం చేస్తున్నాం.. సోనియాను తీసుకువచ్చి విజయవాడలో బహిరంగ సభ ఏర్పాటుచేస్తాం.. రాహుల్‌ గాంధీతో శాసనసభలో పోరాటం నడిపిస్తాం అంటూ ఏపీ కాంగ్రెస్‌ తమ పరువు కాపాడుకోవడానికి గతంలో చాలా ప్రకటనలు చేసింది. ఈ ప్రకటనలన్నీ వారి పరువును మరింత మంటగలిపాయే తప్ప.. వారికి ఏ మాత్రం మేలు చేయలేదు. అలాగే రఘువీరారెడ్డి ఇప్పుడు మట్టిసత్యాగ్రహం పేరిట మరో ఉద్యమాన్ని ప్రకటిస్తున్నారు. ఏదో హడావుడి చేస్తున్నట్లుగా కనిపించాల్సిందే తప్ప.. ఈ ఉద్యమం ద్వారా ఆయన ఏం సాధించగలరో మాత్రం లెక్కతేలడం లేదు.

గతంలో కాంగ్రెస్‌ పార్టీ కోటి సంతకాల ఉద్యమం చేస్తున్నాం అన్నది. ఇప్పటిదాకా దానికి అతీగతీ లేదు. ఇప్పుడే సంతకాలు పూర్తయ్యాయి.. త్వరలో వాటిని తీసుకు వెళ్లి సోనియాకు అందిస్తాం అని అంటున్నారు. ఆ తర్వాత కొన్ని నెలల కిందట కోటి ఎస్సెమ్మెస్‌ ల ఉద్యమం అంటూ మరో ప్రహసనం నడిపించారు. అసలు ఆ ఎస్సెమ్మెస్‌ లు ఇచ్చారో లేదో.. ఎవరికి చేరాయో ఏమీ లెక్క తెలియదు. అది ఒక నవ్వులపాలు ఉద్యమంలాగా నడిచింది.

తీరా ఇప్పుడు మట్టి సత్యాగ్రహం అంటూ కొత్త పాట పాడుతున్నారు. అమరావతి మట్టి సేకరణతోనే ఈ ఉద్యమం నడుపుతారట. మట్టి కుండలను ప్రధాని మోడీకి విడతలుగా పంపుతారట. దీని ద్వారా ఏం ఫలితం ఉంటుందో ఆయనకైనా అర్థమైందో లేదో తెలియడం లేదు.

అయినా పీసీసీకి రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడం గురించి ఏమాత్రం శ్రద్ధ ఉన్నప్పటికీ.. దానికి సంబంధించిన ఉద్యమాన్ని సోనియా సారథ్యంలో నడపాలి. ఆమె మరియు రాహుల్‌ స్వయంగా పార్లమెంటులో పెదవి విప్పి ప్రశ్నిస్తే తప్ప దీనికి సీరియస్‌ నెస్‌ రాదు. అప్పట్లో ప్రధానిగా రాజ్యసభలో ప్రత్యేకహోదా ఇస్తానంటూ ప్రకటన చేసిన మన్మోహన్‌ సింగ్‌ ఇంకా ఆ సభలో సభ్యుడిగానే ఉన్నారు. ఆ సభలో.. తాను ప్రధానిగా చేసిన ప్రకటన ఏమైందనే సంగతి ఆయన ప్రశ్నిస్తే తప్ప.. కేంద్రంలో కదలిక వస్తుందనుకోవడం భ్రమ. తమ కేంద్రనాయకత్వాన్ని ఇసుమంత కూడా కలించలేని పరిస్థితిలో ఉన్న ఏపీ కాంగ్రెస్‌.. అటు మొండితనం మూర్తీభవించిన మోడీ సర్కారును ఏమాత్రం కదిలించగలుగుతుందో అనుమానమే.