Begin typing your search above and press return to search.

ఆశలు వదిలేసుకున్న రఘువీరా

By:  Tupaki Desk   |   29 May 2019 8:07 AM GMT
ఆశలు వదిలేసుకున్న రఘువీరా
X
ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సమాధి అయిపోయినట్టే. ఈ విషయం జనాలకు చాలాకాలం క్రితమే అర్థమైంది. కానీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డికి తాజాగా అర్థమైంది. ఇక ఏపీలో కాంగ్రెస్ కోలుకోలేదని ఫిక్సయిన రఘువీరా రెడ్డి పార్టీకి రాజీనామా సమర్పించారు. అయితే, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మర్యాద పూర్వకంగా ఎన్.రఘువీరారెడ్డి తప్పుకున్నారు.

సీట్లు రాకపోయినా గతంలో కంటే ఈసారి ఓట్లు భారీగా వస్తాయని రఘువీరారెడ్డితో పాటు కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు ఆలోచించారు. అందుకే ప్రత్యేక హోదా హామీని ఇచ్చారు. కానీ ఏ మాత్రం పుంజుకోకపోగా చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ నోటా తో పోటీ పడింది. కాంగ్రెస్ ఈ స్థాయిలో నాశనం కావడానికి రాష్ట్ర విభజన మాత్రమే కారణం కాదు... కాంగ్రెస్ కార్యకర్తలు - సానుభూతి పరులకు జగన్ రూపంలో ధృఢమైన నాయకత్వం దొరకడంతో వారికి ఇక కాంగ్రెస్ వైపు చూడాల్సిన అవసరం రాలేదు. దీంతో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయింది.

ఇటీవలి ఎన్నికల్లో 25 లోక్ సభ స్థానాల్లో నోటాకు 1.5 శాతం ఓట్లు పడగా... కాంగ్రెస్ కు మరీ దారుణంగా నోటా కంటే తక్కువ వచ్చాయి. కాంగ్రెసుకు పడిన ఓటింగ్ శాతం 1.29 శాతం. ఇక అసెంబ్లీ స్థానాల్లో రాష్ట్రంలోని 175 శాసనసభ స్థానాలు కలిపి నోటాకు 1.28 శాతం ఓట్లు పడగా - కాంగ్రెసుకు 1.17 శాతం ఓట్లు పోలయ్యాయి. దీంతో రఘువీరారెడ్డికి ఇక కాంగ్రెస్లో భవిష్యత్తు లేదని స్పష్టంగా అర్థమైంది. బహుశా ఇపుడు ఆయన ముందు వైసీపీ పార్టీలో చేరడం మినహా వేరే అవకాశమే లేదు. దేశంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో ఇక కార్యక్రమాలు నిర్వహించడానికి నిధుల లేమి కూడా భారీగా ఉండనుంది. దీంతో రఘువీరా తెలివిగా తప్పుకున్నారు.

మరోవైపు జాతీయాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఇటీవలే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేతలతో పాటు, కాంగ్రెస్ మిత్ర కూటమి కూడా రాహుల్ రాజీనామా వెనుక్కు తీసుకోవాలని బుజ్జగిస్తున్నాయి. అయినా కూడా తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగలేనని రాహుల్ మొండిపట్టు మీదున్నారు. ఇకపై కాంగ్రెస్ పగ్గాలు గాంధీ కూటమికి వద్దని, వేరే వారికి అప్పగించడం బెటరని రాహుల్ నమ్ముతున్నారు. అదే విషయాన్ని ఆయన పేర్కొంటున్నారు. తాను విజేత కాకపోయినా పార్టీ బలంగా ఉండాలన్నది ఆయన అభిప్రాయం అని చెబుతున్నారు. పార్టీకి గుండె వంటి సీడబ్లూసీ కమిటీ రాహుల్ గాంధీని రాజీనామా వెనక్కు తీసుకోవాలని చెబుతోంది. మొత్తాని కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. భవిష్యత్తుపై ఆ పార్టీలో చాలామందికి ఆశల్లేవు.