Begin typing your search above and press return to search.

బ్రేకింగ్:పీసీసీ పదవికు రఘువీరా గుడ్ బై

By:  Tupaki Desk   |   3 July 2019 4:59 AM GMT
బ్రేకింగ్:పీసీసీ పదవికు రఘువీరా గుడ్ బై
X
అనుకున్నట్టే అయ్యింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తరహాలోనే దేశవ్యాప్తంగా పీసీసీ చీఫ్ లు - కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల బాధ్యుల రాజీనామాల పరంపర కొనసాగుతోంది. ఈ కోవలోనే ఏపీ పీసీసీ పదవికి రఘువీరారెడ్డి రాజీనామా చేశారు. అసెంబ్లీ - పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని పీసీసీ అధ్యక్షులు రాజీనామా చేశారు. వారి బాటలోనే రఘువీరా సైతం పదవి విడిచిపెట్టడం విశేషం. ఇక తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం రాజీనామాకు ససేమిరా అంటున్నారు. ఆయన దిగిపోవాలని సొంత కాంగ్రెస్ నేతలు వీహెచ్ - రేవంత్ - కోమటిరెడ్డిలు బహిరంగంగా కోరుతున్నా ఆయన మాత్రం పదవిని వీడేందుకు సాహసించడం లేదు.

ఇక మొన్నటి ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కళ్యాణ దుర్గంలో పోటీచేసిన ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా దారుణ పరాజయం పొందారు. ఏపీ మొత్తం వైసీపీ గాలి వీచింది. ముఖ్యంగా రఘువీరా పోటీచేసిన అనంతపురం జిల్లాలో కూడా వైసీపీ హోరులో టీడీపీ దిగ్గజాలైన జేసీ ఫ్యామిలీ - పరిటాల ఫ్యామిలీ కొట్టుకుపోయాయి. ఇక ఏపీ వ్యాప్తంగా కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్క సీటు దక్కించుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఓటమికి బాధ్యత వహిస్తూ రఘువీరా రాజీనామా చేశారు.

కాంగ్రెస్ ను ప్రక్షాళన చేయాలని.. బూజు పట్టినట్టున్న కాంగ్రెస్ సీనియర్లు అంతా పార్టీకి రాజీనామా చేస్తేనే తాను కాంగ్రెస్ బాధ్యతలు చేపడుతానని రాహుల్ మొండికేస్తున్నారు. అందుకే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బాధ్యులు రాజీనామా బాటపట్టారు. ఇప్పుడు రఘువీరా కూడా ఏపీ కాంగ్రెస్ బాధ్యతల నుంచి వైదొలిగారు.