Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ విగ్ర‌హంతోనే ఘోరం జ‌రిగిందా?

By:  Tupaki Desk   |   14 July 2015 11:39 AM GMT
ఎన్టీఆర్ విగ్ర‌హంతోనే ఘోరం జ‌రిగిందా?
X
బోడిగుండుకు మోకాలికి ముడి వేయ‌టం మామూలే. మిగిలిన వాళ్ల సంగ‌తేమో కానీ.. రాజ‌కీయ నాయ‌కులు ఇలాంటివి త‌ర‌చూ చేస్తుంటారు. త‌మ‌కు లాభం క‌లుగుతుంద‌ని భావిస్తే.. ఇలాంటి చిత్ర‌విచిత్ర‌మైన చేష్ట‌ల‌తో పాటు.. వ్యాఖ్య‌లు వారు త‌ర‌చూ చేస్తుంటారు. తాజాగా ఏపీ కాంగ్ర‌స్ సార‌థి ర‌ఘ‌వీరారెడ్డి ఇలాంటి చిత్ర‌మైన వ్యాఖ్య‌లే చేశారు.
గోదావ‌రి పుష్క‌రాల సంద‌ర్భంగా.. భారీ తొక్కిస‌లాట చోటు చేసుకోవ‌టం.. 27 మంది భ‌క్తులు మ‌ర‌ణించ‌టం తెలిసిందే. ఈ ఘోరానికి ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంతోపాటు.. అధికారుల అల‌స‌త్వం.. ప్ర‌ణాళిక‌లోపం.. ఏర్పాట్ల విష‌యంలో దొర్లిన మాన‌వ త‌ప్పిదాలు బోలెడ‌న్ని క‌నిపిస్తాయి.

మొద‌టి పుష్క‌ర ఘాట్ లో ముఖ్య‌మంత్రి స్నానం చేసి వెళ్లేంత వ‌ర‌కూ భ‌క్తుల్ని అనుమ‌తించ‌క‌పోవ‌టం.. స‌ద‌రు ఘాట్ కు ఒక‌టే ప్ర‌వేశ‌.. నిష్ర్క‌మ‌ణ ద్వారం ఉండటం.. పెద్ద ఎత్తున భ‌క్తులు ఆ ఘాట్ లో స్నానం చేయాల‌ని అనుకోవ‌టం.. భారీగా వ‌చ్చి ప‌డ్డ భ‌క్త జ‌నాన్ని ఒక క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో పంపించేందుకు అవ‌స‌ర‌మైన పోలీసు యంత్రాంగం లేక‌పోవ‌టం లాంటి స‌వాల‌చ్చ కార‌ణాలు క‌నిపిస్తాయి.

వాటిని వ‌దిలేసిన ర‌ఘువీరా.. ప్ర‌జ‌ల్ని త‌ప్పుదారి ప‌ట్టించే చిత్ర‌మైన వాద‌న‌ను తెర‌పైకి తీసుకొచ్చారు. రాజ‌మండ్రి పుష్క‌ర ఘాట్ల వ‌ద్ద చంద్ర‌బాబు ఏర్పాటు చేయించిన ఎన్టీఆర్ కృష్ణుడు బొమ్మ కార‌ణంగానే ఇంత మంది చ‌నిపోయిన‌ట్లుగా వ్యాఖ్యానించారు.

పుష్క‌ర‌ఘాట్ లో ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌టం అప‌చార‌మ‌ని.. ఎన్టీఆర్ ను చంపిన పాపాన్ని క‌డిగేసుకునేందుకే పుష్క‌ర ఘాట్ ద‌గ్గ‌ర ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశార‌ని.. అందుకు 27 మందిని బ‌లిచ్చార‌ని వ్యాఖ్యానించారు. ర‌ఘువీరా చేసిన విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌ల‌కు త‌ర్కం ఉందో లేదో ప్ర‌జ‌లే నిర్ణ‌యించుకోవాలి. చూస్తుంటే.. చ‌నిపోయిన వారి ప‌ట్ల సానుభూతి.. బాధ కంటే కూడా.. బాధితులు చెల‌రేగిపోయేలా.. భావోద్వేగంతో వ్య‌వ‌హరించేలా విమ‌ర్శ‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం.