Begin typing your search above and press return to search.

అధ్యక్షుల వారు హర్ట్ అయ్యారు

By:  Tupaki Desk   |   9 May 2015 11:56 PM IST
అధ్యక్షుల వారు హర్ట్ అయ్యారు
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై ఏపీపీసీసీ అధ్యక్షుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌ నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎర్రచందనం దొంగలని అనడం తగదని అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నందున కాంగ్రెస్ పార్టీలో నేరప్రవృత్తిలో ఉన్న వారి జాబితా 24 గంటల్లో ప్రకటించాలని.. లేదంటే తమ పార్టీ వారికి క్షమాపణ చెప్పాలని రఘువీరా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలను దొంగలన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా ఖండించారు. సీఎం చంద్రబాబు తన హోదాను గుర్తుపెట్టుకొని విమర్శలు చేయాలని సూచించారు.

రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని రఘువీరా చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులను బెదిరించడం సరికాదని అన్నారు. సమ్మెకాలంలో ప్రైవేటు ఆపరేటర్లంతా టీడీపీకి సంబంధించిన వారేనని విమర్శించారు. ఆర్టీసీని బలహీన పరిచి ఏదో ఒకరోజు ప్రైవేటు వారికి అప్పగించాలన్నదే చంద్రబాబు ఆలోచన అని మండిపడ్డారు.

మే 13 లోపు లక్ష కోట్లతో ప్రత్యేక హోదాతో రాష్ట్రంలో అడుగు పెట్టాలని టీడీపీ, బీజేపీ ఎంపీలకు రఘువీరా సవాల్ విసిరారు. లేదంటే 14న హైదరాబాద్ ఇందిరా భవన్ లో అన్ని జిల్లా అధ్యక్షులతో పీసీసీ కార్యవర్గంతో సమావేశమై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పకడ్బందీగా వ్యూహరచన చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని, వాటిలో చట్టం చేసి ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రం పేరు చెప్పండంటూ రఘువీరా ఆగ్రహం వ్యక్తం చేశారు.