Begin typing your search above and press return to search.

ర‌ఘువీరా మెడ‌కు రాహుల్ డోలు

By:  Tupaki Desk   |   12 May 2017 9:00 AM GMT
ర‌ఘువీరా మెడ‌కు రాహుల్ డోలు
X
తాదూర కంత లేదు మెడ‌కో డోలు.. అన్న సామెత వినే ఉంటారు. ఏపీ పీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి మాట‌లు ఇప్పుడ‌లాగే ఉంటున్నాయి. ఏపీలో 2014లో ఒక్క సీటు కూడా గెల్చుకోలేక‌పోయిన కాంగ్రెస్ పార్టీ 2019లోనూ బోణి కొట్టే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు... కానీ, ర‌ఘువీరా మాత్రం ఏకంగా రాహుల్ గాంధీని ప్ర‌ధ‌న మంత్రి చేయ‌డానికి కంక‌ణం క‌ట్టుకున్నారు. దేశంలో 2019లో జరగనున్న ఎన్నికల్లో రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రి చేయడమే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమని పీసీసీ అధ్యక్షుడు అంటున్నారు. అంతేకాదు... చాలాకాలం త‌రువాత దివ‌గంత సీఎం రాజ‌శేఖ‌ర‌రెడ్డి గొప్ప‌ద‌నాన్ని గుర్తు చేసుకుని ఆయ‌న ఇమేజిని కాంగ్రెస్ పార్టీ కోసం వాడుకునే ప్ర‌య‌త్నాలు మొదలు పెడుతున్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో బూత్‌ స్థాయి నుంచి అలిండియా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడి వరకు అన్ని ఎన్నికలు ప్రజాస్వామ్య యుతంగా జరుగుతాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ 70 ఏళ్లు కష్టపడి దేశాన్ని అభివృద్ధి చేస్తే బీజేపీ - టీడీపీలు మూడేళ్ల కాలంలో కుక్కలు చింపిన విస్తరిగా మార్చాయని విమర్శించారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని విస్మరించాయన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి లౌకికవాదానికి కట్టుబడిన వ్యక్త‌ని చెబుతూ వైఎస్ ఇమేజిని క్యాష్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు.

ప్రత్యేకహోదాయే ప్రజా అజెండాగా సాగుతామని... బీజేపేతర శక్తులన్నింటితో కాంగ్రెస్‌ పార్టీ బలమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉందన్నారు. రాహుల్‌ గాంధీ ప్రచారం చేస్తే ఓట్లు రావడం లేదన్న‌ది అస‌త్య‌మ‌ని... ఆయ‌న చాలా గొప్ప వ్యక్త‌ని, ప్రధాని పదవిని త్యాగం చేశారని చెప్పుకొచ్చారు. ప్రత్యేకహోదా కోసం 14 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టామన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/