Begin typing your search above and press return to search.

రహానే రైజింగ్.. కోహ్లీ తప్పుకోవాలి!

By:  Tupaki Desk   |   20 Jan 2021 2:30 AM GMT
రహానే రైజింగ్.. కోహ్లీ తప్పుకోవాలి!
X
ఆస్ట్రేలియా గడ్డపై సుదీర్ఘ విరామం తర్వాత భారత్ టెస్ట్ సిరీస్ విజయం సాధించడంతో టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. విరాట్ కోహ్లీ గైర్హాజరీ.. సీనియర్లు గాయాలతో దూరమైనా.. కుర్ర సైన్యంతో సత్తా చాటాడు అజింక్యా రహానే. దీంతో.. కోహ్లీ టెస్టు కెప్టెన్సీని రహానేకు విడిచి పెట్టాలని, అది జట్టుతోపాటు తనకు కూడా మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రహానే కేక..
తొలి టెస్టులో ఘోర పరాజయం అనంతరం కోహ్లీ ఇంటికి బయలుదేరాడు. దీంతో.. మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్టుకు నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు రహానే. ఆ మ్యాచ్ లో అద్భుత విజయాన్నందుకొని సిరీస్ లెక్క సరిచేశాడు. ఆ తర్వాత సిడ్నీ గడ్డపై అద్వితీయ పోరాటంతో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. అనంతరం ఆసీస్‌కు అచ్చొచ్చిన గబ్బాలోనూ రాజీలేని పోరాటం చేసి, మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది టీమిండియా. ఈ విజయాల్లో సారథిగా రహానేది పాత్ర ఎంతో కీలకం. మెల్‌బోర్న్‌లో సూపర్ సెంచరీతో అండగా నిలిచిన కెప్టెన్.. సిడ్నీలో తన ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్, బ్యాటింగ్ ఆర్డర్ వ్యూహాలతో ఆకట్టుకున్నాడు. సీనియర్ల అండ లేకున్నా.. యువ ఆటగాళ్లతో మ్యాచ్‌లను గెలిపిస్తూ మిస్టర్ కూల్ ధోనీని తలపించాడు రహానే.

అపజయమెరుగని నాయకుడు..
రహానే ఇప్పటి వరకు 5 మ్యాచ్‌ల్లో భారత్‌కు సారథ్యం వహించాడు. ఇందులో నాలుగింటిలో గెలుపు జెండా ఎగరేయగా.. ఒక మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. ఈ సిరీస్‌కు ముందు రెండు మ్యాచ్‌ల్లో జట్టును నడిపించిన రహానే ఆ రెండింటిలోనూ విజయాన్నందించాడు. ఇక ఈ సిరీస్‌లో ఆరంభంలోనే ఘోర పరాజయం ఎదురై, అవమాన భారంతో కుంగిపోతున్న జట్టు బాధ్యతలు స్వీకరించి, దేశం తలెత్తుకునేలా చారిత్రక విజయాన్ని అందించాడు.

కోహ్లీ తప్పుకుంటే మంచిది..
ఆసీస్ పై సిరీస్ విజయంతో రహానేను టెస్టు కెప్టెన్‌గా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆఖరి టెస్ట్ విజయానంతరం ట్విటర్ వేదికగా రహానే కెప్టెన్సీ కొనియాడుతూ.. టెస్ట్‌ల్లో అతన్నే కొనసాగించాలని కోరుతున్నారు. అంతేకాకుండా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని విరాట్ కోహ్లీకి సూచిస్తున్నారు. దానివల్ల కోహ్లీ వ్యక్తిగతంగా రాణించడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. ఎలాగూ వన్డే సారధిగా ఉన్నాడు కాబట్టి.. టెస్టు బాధ్యతలు రహానేకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.

గతంలో కూడా..
కోహ్లీ టెస్టు కెప్టెన్సీ వదులుకోవాలనే డిమాండ్ గతంలోనూ వినిపించింది. రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ వ్యక్తమైంది. అయితే.. కొందరు సమర్థించగా.. మరికొందరు వ్యతిరేకించారు. మరి, ఈ తాజా డిమాండ్ ఎంత వరకు వెళ్తుందనేది చూడాలి.