Begin typing your search above and press return to search.

రాహుల్ నోట టీఆర్ ఎస్ మాట‌.. పొత్తుల‌పై హాట్ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   31 Oct 2022 1:30 PM GMT
రాహుల్ నోట టీఆర్ ఎస్ మాట‌.. పొత్తుల‌పై హాట్ కామెంట్స్‌
X
కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ తెలంగాణ‌లో జోడో యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణ‌లో పొత్తు రాజ‌కీయాల‌పై ఆయ‌న స్పందించారు. టీఆర్ ఎస్‌తో ఎలాంటి అవగాహన లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని.. ఒంటరిగానే పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. భారత్‌ జోడో యాత్ర ప్ర‌స్తుతం రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో జ‌రుగుతోంది. ఈ యాత్ర‌కు భారీ ఎత్తున జ‌నాలు త‌ర‌లివ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ఏ పార్టీతోనూ పొత్తులేకుండా ఒంట‌రిగానే పోటీ చేయాల‌ని కాంగ్రెస్ రాష్ట్ర నేత‌లు చెబుతున్నారని.. అలాగే చేస్తామ‌ని రాహుల్ వ్యాఖ్యానించారు.

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలు విభజన శక్తులు, సంఘటిత శక్తులకు మధ్య జరిగే పోరాటంగా ఉండబోతున్నాయ‌న్నారు. బీజేపీ, టీఆర్ ఎస్‌ ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయన్నారు. ''ఉప ఎన్నికకు రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఆ రెండు పార్టీలకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. గుజరాత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచి తీరుతుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకుంటా. భారత్‌ జోడో యాత్రతో ప్రజల్లో చైతన్యం నింపుతున్నాం. యాత్ర పొడవునా అందరూ చెప్పే మాటలు వింటా’’ అని రాహుల్‌ అన్నారు.
టీఆర్ ఎస్ త‌న‌నుతాను ప్ర‌పంచ‌ పార్టీగా ఊహించుకున్నా త‌ప్పులేద‌న్నారు.

రాహుల్ ఇంకా ఏమ‌న్నారంటే..
+ మోడీ హయాంలో ప్రణాళికా బద్దంగా రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేశారు. ఇది దేశానికి నష్టదాయకం. ఉద్యోగాల కల్పన లేకుండా చేశారు.

+ దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ ఎస్‌ ఒకే విధానాన్ని అవలంబిస్తున్నాయి. సంపదను కొద్ది మంది వ్యాపారుల చేతుల్లో పెడుతున్నారు. దేశ సమైక్యత కోసమే మేం భారత్ జోడో యాత్ర చేపట్టాం. బీజేపీ విద్వేష రాజకీయాలను తిప్పికొట్టాలనే మా ప్రయత్నం.

+ కాంగ్రెస్ ప్రజాస్వామిక పార్టీ.. ఇక్కడ నియంతృత్వం ఉండదు. ప్రజాస్వామ్య పద్ధతిలో కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకుంది. కానీ బీజేపీ, టీఆర్ ఎస్‌, ఇతర పార్టీలు ఎప్పుడైనా ఇలా ఎన్నుకున్నాయా? అవినీతిమయమైన, ప్రజా ధనాన్ని లూటీ చేసే పార్టీలతో పొత్తు ఉండదు.

+ రాజకీయంగా కొందరు నాయకులు ఎవరికి వారు త‌మది పెద్ద పార్టీగా ఊహించుకోవచ్చు.టీఆర్ ఎస్‌ కూడా తమకు తాము నేషనల్ పార్టీ, గ్లోబల్ పార్టీ అని ఊహించుకోవడంలో తప్పులేదు. చాలా సంవత్సరాల క్రితమే నేను భారత్ జోడో యాత్ర చేయాలనుకున్నా. కానీ, కొవిడ్ విజృంభించడం, ఇతర కారణాల తో చేయలేకపోయా.

+ జోడో యాత్రతో వ్యక్తిగతంగా ఎన్నో నేర్చుకుంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి కూడా ఈ యాత్ర ఉపయోగ పడుతుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. భారత్ జోడో యాత్ర క్రీడా యాత్ర కాదు.. కచ్చితంగా పొలిటికల్ యాత్రే. ప్రస్తుతం నేను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రను కొనసాగించడమే నా లక్ష్యం. రాజకీయపరమైన అంశాలపై యాత్ర ముగిశాకే మాట్లాడుతా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.