Begin typing your search above and press return to search.

క్లియర్: బీజేపీ వ్యతిరేక కూటమిలో కనిపించని ధీమా!

By:  Tupaki Desk   |   21 May 2019 5:57 PM GMT
క్లియర్: బీజేపీ వ్యతిరేక కూటమిలో కనిపించని ధీమా!
X
ఒకవైపు ఎగ్జిట్ పోల్స్ ను తాము నమ్మమంటూ ప్రకటనలు అయితే చేస్తూ ఉన్నారు కానీ, భారతీయ జనతా పార్టీ వ్యతిరేక కూటమిలో అందుకు సంబంధించిన ధీమా మాత్రం కనిపించడం లేదు. మంగళవారం రోజున ఢిల్లీలో చోటు చేసుకున్న వివిధ పరిణామాలను గమనించిన పక్షంలో ఈ విషయం స్పష్టం అవుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయడం గురించి మొన్నటి వరకూ చెప్పిన మాటల జోష్ ఇప్పుడు వారి చేతల్లో కనిపించడం లేదు.

ఆఖరికి తొలి సారి ఈ విపక్షాల అన్నింటి సమావేశం జరిగితే ఆ కార్యక్రమానికి కీలక నేతలంతా మొహం చాటేశారు! ఇప్పటి వరకూ బీజేపీ వ్యతిరేక పక్షాల సమావేశం ఏదీ జరగలేదు. ఎక్కడిక్కడ ఈ పార్టీలన్నీ వేర్వేరుగా పోటీ చేశాయి. యూపీలో ఎస్పీ-బీఎస్పీలు ఒక జట్టుగా - కాంగ్రెస్ వేరేగా పోటీ చేసింది. పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ వర్సెస్ టీఎంసీ పోరు సాగింది. ఇలా ఎక్కడిక్కడ ఈ బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ తమలో తాము తలపడ్డాయి. దీంతో పోలింగ్ కు ముందు వీటి సమావేశమే జరగలేదు.

పోలింగ్ అయిపోయిన నేపథ్యంలో తొలి సారి మీటింగ్ జరగగా దానికి కీలక నేతలు హాజరే కాలేదు! కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ సమావేశం వైపు చూడనే లేదు! అంతే కాదు.. బీఎస్పీ అధినేత్రి మాయవతి కూడా ఆ సమావేశం వైపు రాలేదు! కొన్ని పార్టీలకు సంబంధించి మాత్రమే ప్రథమ శ్రేణి నేతలు హాజరయ్యారు. మరి కొన్ని పార్టీల సెకెండ్ గ్రేడ్ నేతలు హాజరయ్యారు.

ఆ కూటమికి ఇదంత ఆహ్వానించదగిన పరిణామం కాదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తీరుతోనే బీజేపీ వ్యతిరేక పక్షాలకు ధీమా సడలిందని, అందుకే ఇప్పుడు ఆ కూటమి మీటింగును ఆ పార్టీలే లైట్ తీసుకున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.