Begin typing your search above and press return to search.

కాకి లెక్క‌లు ఆపేయండి రాహుల్.. ఏచూరీ!

By:  Tupaki Desk   |   2 Feb 2019 5:33 AM GMT
కాకి లెక్క‌లు ఆపేయండి రాహుల్.. ఏచూరీ!
X
మోడీ లాంటి ప్ర‌జాక‌ర్ష‌క ప్ర‌ధాన‌మంత్రిని.. ఆయ‌న ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ ను విమ‌ర్శ చేసేట‌ప్ప‌డు చాలా జాగ్ర‌త్త‌గా రియాక్ట్ కావాలి. లేకుంటే అభాసుపాలు కావ‌టం ఖాయం. చేసింది పైసా అయినా..రూపాయి చేసిన‌ట్లుగా చెప్పుకోవ‌టమే కాదు.. అంద‌రిని న‌మ్మించే టాలెంట్ మోడీ మాష్టారిలో ట‌న్నుల లెక్క‌న ఉంటుంది. అందుకే.. ఆయ‌న లాంటి నేత‌ను విమ‌ర్శించాలంటే లాజిక్కు ప‌క్కాగా ఉండాలి.

కానీ.. ఈ విష‌యాన్ని త‌ల‌పండిన రాజ‌కీయ నేత‌లకు అర్థం కావ‌ట్లేద‌ని చెప్పాలి. తాజా బ‌డ్జెట్ లో రైతుల‌కు ఆదుకునేందుకు ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాన్ని త‌ప్పు ప‌ట్టే క్ర‌మంలో ప‌లువురు నేత‌లు త‌ప్పులోకాలేయ‌టం క‌నిపిస్తుంది. ఈ ప‌థ‌కానికి మాతృక తెలంగాణ‌లో అమ‌లు చేస్తున్న రైతుబంధు ప‌థ‌క‌మే అయిన‌ప్ప‌టికీ.. ఆ విష‌యాన్ని టీఆర్ఎస్ నేత‌లు మిన‌హా మ‌రెవ‌రూ నోరు విప్ప‌టం లేదు. ఎందుకంటే.. కేసీఆర్‌ను హైలెట్ చేయ‌టం ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు కాబ‌ట్టి. చూస్తూ.. చూస్తే.. ఒక రాజ‌కీయ పార్టీని పొగ‌డ‌టం.. ఆ పార్టీ ప‌వ‌ర్లో ఉన్న రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాన్ని మోడీ స‌ర్కారు స‌రిగా కాపీ కూడా కొట్టలేక‌పోయింద‌న్న మాట‌ను చెప్పే ధైర్యం మిగిలిన పార్టీ నేత‌ల‌కు ఉండ‌దు.

దీంతో.. ఈ ప‌థ‌కాన్ని వీలైనంత త‌క్కువ చేసే ప్ర‌య‌త్నం చేస్తూ.. కాకి లెక్క‌ల్ని చూపిస్తూ త‌ప్పు ప‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు. మేధావిగా..రాజ‌కీయాల్లో త‌ల‌పండినోడిగా చెప్పుకునే సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరీనే ఒక ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుందాం.

మోడీ స‌ర్కారు ప్ర‌క‌టించిన రైతు సాయాన్ని ఉద్దేశించి ఆయ‌న చెప్పిన లెక్క‌ను వింటే షాక్ తినాల్సిందే. ఎందుకంటే.. ఒక రైతు కుటుంబంలోని ఐదుగురు స‌భ్యులు ఉంటే.. ప్ర‌భుత్వం రోజుకు ఒక్కొక్క‌రికి ఇచ్చేది మూడు రూపాయిలేనా? అంటూ ప్ర‌శ్నించారు. వాస్త‌వానికి ఇక్క‌డ కుటుంబ స‌భ్యుల కంటే కూడా.. పొలానికి ఇస్తున్న‌సాయమ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోయారు. ఐదు ఎక‌రాల లోపున్న భూమికి ఏడాదికి ఆరు వేల సాయం అంటే.. ఎక‌రానికి రూ.1200. ఈ మొత్తంతో ఏం వ‌స్తుంద‌న్న లెక్క చెప్పినా అర్థం ఉంది. కానీ.. ఇదేమీ చెప్ప‌కుండా ఇంట్లో ఉన్న కుటుంబ స‌భ్యుల‌తో పోల్చ‌టం అర్థం లేనిదిగా చెప్పాలి.

ఇక‌.. కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ సైతం ఇదే త‌ర‌హాలో అత‌క‌ని లెక్క‌ను వినిపించారు. కాకుంటే.. ఆయ‌న చేసిన వాద‌న‌లో కాస్త లాజిక్ ఉండ‌ట‌మే కాదు.. మోడీ ప్ర‌క‌టించిన రైతు సాయం ప‌థ‌కం ఎన్నిక‌ల ప్ర‌యోజ‌నం కోస‌మే అన్న భావ‌న క‌లిగించ‌టంలో స‌క్సెస్ అయ్యార‌ని చెప్పాలి. ఎందుకంటే..కేవ‌లం 15 కార్పొరేట్ కంపెనీల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించేందుకు వారికున్న బ్యాంకు రుణాల్లో రూ3.5ల‌క్ష‌ల కోట్లను మాఫీ చేసిన మోడీ స‌ర్కారు.. రైతుల‌కు మాత్రం రోజుకు రూ.17 ఇస్తామ‌ని చెప్ప‌టంలో అర్థం లేనిదిగా చెప్పారు.

గుప్పెడు కార్పొరేట్ కంపెనీల‌కు మోడీ స‌ర్కారు క‌లిగించిన భారీ ప్ర‌యోజ‌నాన్ని చెప్ప‌టం ద్వారా మోడీ తీరును ఎండ‌గ‌ట్టిన రాహుల్.. రైతుల‌కు ఆయ‌న ప్ర‌క‌టించిన సాయాన్ని లెక్క క‌ట్టే విష‌యంలో మాత్రం త‌ప్పు ప‌ట్టారు. రైతుల‌కు పంట సాయంగా అందించే ఈ మొత్తం ఏడాదికి ఎక‌రానికి ఎంత‌న్న‌ది చూసిన‌ప్పుడు.. ప్ర‌భుత్వం ఇచ్చే మొత్తంతో పురుగుమందు డ‌బ్బా ఒకటి కొనుగోలు చేయ‌టానికి కూడా స‌రిపోని ప‌రిస్థితి. ప‌ప్పు బెల్లాల మాదిరి డ‌బ్బు పంచే బ‌దులు వారికి ప్ర‌యోజ‌నం క‌లిగించేలా ప‌థ‌కాన్ని రూపొందించి ఉంటే బాగుండేది. నిర్మాణాత్మ‌క విమ‌ర్శ ద్వారా ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన విప‌క్ష నేత‌లు.. అత‌క‌ని లెక్క‌ల్ని వినిపించి అభాసుపాల‌య్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.