Begin typing your search above and press return to search.

క్ష‌మించండి... ఇక నుంచి జాగ్ర‌త్త‌గా ఉంటా: ఈడీకి రాహుల్ గాంధీ క్ష‌మాప‌ణ‌లు

By:  Tupaki Desk   |   14 Jun 2022 11:30 AM GMT
క్ష‌మించండి... ఇక నుంచి జాగ్ర‌త్త‌గా ఉంటా:  ఈడీకి రాహుల్ గాంధీ క్ష‌మాప‌ణ‌లు
X
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులకు క్షమాపణ చెప్పారు. సోమవారం ఈడీ విచారణకు హాజరైన ఆయన... లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాల్లో తప్పులు దొర్లిన నేపథ్యంలో అధికారులకు క్షమాపణలు చెప్పారని ఈడీ వర్గాలు తెలిపాయి. మంగళవారం వాంగ్మూలం నమోదు చేసే సమయంలో జాగ్రత్తగా ఉంటానని రాహుల్ చెప్పినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.

ఈడీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 8.30గంటలకే రాహుల్‌ గాంధీ తొలిరోజు విచారణ ముగిసింది. రెండు దఫాలుగా జరిగిన విచారణలో రాహుల్ గాంధీ ఇచ్చిన లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానాల్లో తప్పులు దొర్లాయి.

న్యాయవాది సలహా మేరకు వాటిని సరిచేసి, సంతకం చేసేందుకు రాహుల్ సమయం తీసుకున్నారు. ఈడీ అధికారులు నమోదు చేసిన స్టేట్‌మెంట్‌ను కూడా రాహుల్‌ గాంధీ చూసి, ఆమోదించిన తర్వాతే కార్యాలయం నుంచి బయటికి వచ్చారు.

ఈ కారణంగానే రాహుల్ గాంధీ ఈడీ ప్రధాన కార్యాలయంలో రాత్రి 11.30 గంటల వరకు ఉన్నారు. తన రాతపూర్వక సమాధానాల్లో తప్పులు దొర్లిన చోట్ల మార్పులు చేస్తున్న సమయంలో ఈడీ అధికారులకు రాహుల్‌ పలుమార్లు క్షమాపణ చెప్పినట్లు సమాచారం.

మంగళవారం వాంగ్మూలం నమోదు చేసే సమయంలో... జాగ్రత్తగా వ్యవహరిస్తానని ఈడీ అధికారులతో రాహుల్‌ అన్నట్లు సమాచారం. పీఎంఎల్ఏ చట్టం ప్రకారమే లిఖిత పూర్వక, వ్యక్తిగత వాగ్మూలం నమోదు చేస్తున్నట్లు రాహుల్‌ గాంధీకి ఈడీ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే.. సోనియా, రాహుల్ గాంధీల‌కు ఈడీ నోటీసులు జారీ చేయ‌డాన్ని నిర‌సిస్తూ.. దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ నాయ‌కులు ధ‌ర్నా చేస్తున్నారు. వ‌రుస‌గా రెండో రోజు కూడా వారు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. సోమ‌వారం జ‌రిగిన నిర‌స‌న‌లో కీల‌క నాయ‌కుల అరెస్టులు చోటు చేసుకున్న నేప‌థ్యంలో తాజాగా మంగ‌ళ‌వారం.. నిర‌స‌న‌ల హోరు కొంత మేర‌కు త‌గ్గింద‌నే చెప్పాలి. అయితే.. శాంతి యుత నిర‌స‌న పేరిట సీనియ‌ర్ నాయ‌కులు.. ఢిల్లీలో మౌన దీక్ష చేప‌ట్టారు. రాష్ట్రాల్లో కొంత మేర‌కు వేడి త‌గ్గింది.